మళ్లీ టాప్‌లోకి సాత్విక్‌-చిరాగ్‌ జోడి

Jan 23,2024 22:20 #Sports

ప్రణయ్ కు 8వ ర్యాంక్‌

లాసన్నె: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్‌) తాజా ర్యాంకింగ్స్‌లో భారత డబుల్స్‌ జోడీ చిరాగ్‌-సాత్విక్‌ సత్తా చాటారు. బిడబ్ల్యుఎఫ్‌ మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత జంట మళ్లీ నంబర్‌వన్‌ స్థానానికి ఎగబాకారు. చైనాకు చెందిన లియాంగ్‌ వీ కెంగ్‌, వాంగ్‌ చాంగ్‌ జోడీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. మలేషియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచినప్పటికీ భారత జోడీకి టాప్‌ ర్యాంక్‌ దక్కడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో నిలకడగా రాణిస్తున్న హెచ్‌ఎస్‌ ప్రణరు 8వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తానీసా క్రాస్టో 20వ ర్యాంక్‌ సొంతం చేసుకున్నారు. గత ఏడాది సాత్విక్‌-చిరాగ్‌ జోడీ తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంక్‌కు సాధించింది. తర్వాత జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు నిరాశ పరిచారు. అలా మూడు వారాల్లోనే లియాంగ్‌, వాంగ్‌ ద్వయం టాప్‌ సీడ్‌ దక్కించుకోగా.. భారత జోడీ రెండో సీడ్‌కు పరిమితమైంది. 2023లో ఈ స్టార్‌ జోడీ పలు ట్రోఫీలు కొల్లగొట్టింది. ఆసియా ఛాంపియన్‌షిప్‌, ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000 టైటిల్‌ విజేతగా అవతరించింది.

➡️