మార్చి 22నుంచి ఐపిఎల్‌

Feb 20,2024 22:05 #Sports

– భారత్‌లోనే ఈ సీజన్‌ మ్యాచ్‌లన్నీ

– ఎన్నికల దృష్ట్యా రెండు దఫాలుగా నిర్వహణ

– ఐపిఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌

ముంబయి: భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) మార్చి 22నుంచి 2024 ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఐపిఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ మంగళవారం ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రెండు సెషన్స్‌లో ఈ సీజన్‌ ఐపిఎల్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక సెషన్‌ను ఎన్నికలకు ముందు.. రెండో సెషన్‌ను ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని సూచన ప్రాయంగా తెలియజేశారు. ‘ప్రస్తుతం మేం మార్చి 22నుంచి చెన్నైలో టోర్నమెంట్‌ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదే క్రమంలో ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం… ఇప్పటివరకు పార్లమెంట్‌ ఎన్నికల తేదీలను ప్రకటించని దృష్ట్యా ఐపిఎల్‌ తొలి సెషన్‌ను ముందే ప్రకటించాలని అనుకుంటున్నామని, ఎన్నికల తేదీలు వెల్లడించాక దానికి అనుగుణంగా తర్వాత ప్లాన్‌ చేస్తాం’ అని ఆయన తెలిపారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా చెన్నై సూపర్‌కింగ్స్‌-గుజరాత్‌ జెయింట్ల మధ్య ఎంఎ చిదరం స్టేడియంలో తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌ ఐపిఎల్‌ ప్రారంభం కానుందన్నారు. సార్వత్రిక ఎన్నికల ఉన్నా.. విదేశాల్లో నిర్వహించేది లేదని, సీజన్‌ మొత్తం మ్యాచ్‌లు భారత్‌లోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అన్ని ఫ్రాంచైజీలకు తెలియజేశామని, ఫ్రాంచైజీలు ఆ ప్రతిపాదనను అంగీకరించాయన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనూ దేశంలోనే సీజన్‌ మొత్తం మ్యాచ్‌లు జరిగాయని, అలాగే ఈసారి కూడా నిర్వహిస్తామన్నారు. ఈ విషయమై బోర్డు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఏ విషయం ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. మార్చి 11న ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ముగుస్తుందని, వారం రోజుల విశ్రాంతి తర్వాత ఆటగాళ్లు ఐపిఎల్‌కు సిద్ధమవుతారని ధుమాల్‌ తెలిపారు. ఇక మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) రెండో ఎడిషన్‌ను బెంగళూరు, ఢిల్లీ రెండు వేదికల్లోనే నిర్వహించాలని గతంలో నిర్ణయించామని, శుక్రవారం బెంగళూరు వేదికగా 2024 మహిళల ప్రిమియర్‌లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) ప్రారంభమై.. మార్చి 17న ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుందన్నారు. ఆ తర్వాత బోర్డు, ఆతిథ్య, బ్రాడ్‌కాస్టింగ్‌ను క్రమబద్ధీకరించడానికి ఐదు రోజుల సమయం సరిపోతుందని బోర్డు సభ్యులందరూ భావించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

➡️