ముగ్గురు సభ్యులతో అడ్‌హక్‌ కమిటీ -చైర్మన్‌గా భూఫిందర్‌ సింగ్‌ బజ్వా

Dec 27,2023 22:30 #Sports

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త ప్యానెల్‌ను రద్దు చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. దాని వ్యవహారాలను చూసుకునేందుకు ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ‘అడ్‌ హక్‌ కమిటీ’ని ప్రకటించింది. ఐవోఏ నియమించిన కమిటీలో భూపీందర్‌ సింగ్‌ బజ్వాతో పాటు ఎంఎం సౌమ్య, మంజూష కన్వర్‌లు ఉన్నారు. ఈ కమిటీకి భూపిందర్‌ సింగ్‌ బజ్వా చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. భూపిందర్‌ సింగ్‌ గతంలో కూడా డబ్ల్యూఎఫ్‌ఐ అడ్‌ హక్‌ కమిటీకి చీఫ్‌గా పనిచేశారు. మళ్లీ కొత్త పాలకవర్గం వచ్చేదాకా డబ్ల్యూఎఫ్‌ఐలో అడ్‌హక్‌ కమిటీ అన్ని కార్యక్రమాలను చూసుకోనుంది. ఈ ఏడాది యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ).. డబ్ల్యూఎఫ్‌ఐలో నిర్దేశిత కాలంలో ఎన్నికలు నిర్వహించనందున భారత రెజ్లింగ్‌ సంఘంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రీడా మంత్రిత్వ శాఖ.. అడ్‌ హక్‌ కమిటీని నియమించగా ఆ కమిటీలో కూడా భూపీందర్‌ ఉన్నారు. మూడు రోజుల క్రితమే డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలలో గెలిచిన సంజరు సింగ్‌ ప్యానెల్‌ను రద్దు చేసిన క్రీడా మంత్రిత్వ శాఖ ఐవోఏ అధ్యక్షురాలు పిటి ఉషను అడ్‌హక్‌ కమిటీ చైర్మన్‌గా ఉండాలని కోరినా ఆమె మాత్రం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

➡️