రంజీట్రోఫీ ఫైనల్‌కు విదర్భ

Mar 6,2024 22:05 #Sports

సెమీస్‌లో ఉత్తరప్రదేశ్‌పై 62పరుగుల తేడాతో గెలుపు

మూడోసారి తుదిపోరుకు

నాగ్‌పూర్‌: రంజీట్రోఫీ ఫైనల్లోకి విదర్భ జట్టు దూసుకెళ్లింది. విదర్భ నిర్దేశించిన 402పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మధ్యప్రదేశ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 258పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 6 వికెట్ల నష్టానికి 228 పరుగులతో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ను యశ్‌ ఠాకూర్‌(3/60), అక్షరు(3/42) కట్టడి చేశారు. చివరి రోజు గెలుపుకు మధ్యప్రదేశ్‌ మరో 93 పరుగులు చేయాల్సి ఉండగా… ఆరంభంలోనే కుమార్‌ కార్తికేయ(4), అనుభవ్‌ అగర్వాల్‌(6) వికెట్లు త్వరగా కోల్పోయింది. నైట్‌వాచ్‌ మన్‌ సారాంశ్‌ జైన్‌ ఆవేశ్‌ ఖాన్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు బౌల్డ్‌ కావడంతో.. మధ్యప్రదేశ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో 81.3 ఓవర్‌ వద్ద ఖెజ్రోలియా(11) బౌల్డ్‌ అవడంతో మధ్యప్రదేశ్‌ ఓటమి ఖరారైంది. విదర్భ 62 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్‌ రాథోడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. విదర్భ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. మార్చి 10న ముంబయి, విదర్భ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరగనుంది.

స్కోర్స్‌..

విదర్భ : 170, 402

మధ్యప్రదేశ్‌ : 252, 258

➡️