సడెన్‌ డెత్‌లో ఓడిన అమ్మాయిలు

Jan 18,2024 22:30 #Sports

ఫైనల్‌కు అమెరికా, జర్మనీ3వ స్థానం కోసం జపాన్‌తో డీ

రాంచీ: ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్‌ సెమీఫైనల్లో పటిష్ఠ జర్మనీతో చివరి నిమిషం వరకు పోరాడిన భారత మహిళల జట్టు నిరాశ తప్పలేదు. నాలుగు క్వార్టర్లు ముగిసేసరికి 2-2గోల్స్‌తో జర్మనీతో సమంగా నిలిచిన అమ్మాయిలు.. షూటౌట్‌లోనూ 3-3గోల్స్‌తో సమం చేసి అద్భుతంగా పుంజుకొన్నారు. కానీ సడెన్‌ డెత్‌లో భారత క్రీడాకారిణి గోల్‌ చేయడంలో విఫలం కాగా.. జర్మనీ గోల్‌ చేసి ఫైనల్‌కు చేరడంతోపాటు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక మ్యాచ్‌ ప్రారంభంలో గ్రాడ్‌ ఫిల్లర్‌ దీపిక తగోల్‌ చేసి భారత్‌కు 1-0 ఆధిక్యతను సంపాదించింది. దీంతో తొలి క్వార్టర్‌ ముగిసే సరికి భారత్‌ 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఇక రెండోక్వార్టర్‌ ముగియడానికి మూడు నిమిషాల ముందు జర్మనీ ఒక గోల్‌ చేసింది. జర్మనీ తరఫున ఛార్లొటే ఈ గోల్‌ కొట్టింది. నాల్గో క్వార్టర్‌లో ఇరుజట్లు ఒక్కో గోల్‌ కొట్టాయి. జర్మనీ క్రీడాకారిణులు కొట్టిన మూడో షూటౌట్‌ను భారత హాకీ కెప్టెన్‌ సవిత అద్భుతంగా అడ్డుకోవడంతో భారత్‌ 1-2గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. దీంతో రెండు అర్ధభాగాల సమయం ముగిసేసరికి ఇరుజట్లు 2ా2గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో ఫలితానికి షూటౌట్‌లకు దారితీసింది. షూటౌట్‌లో ఇరుజట్లు 3ా3గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో ఫలితం సడెన్‌ డెత్‌కు దారి తీసింది. సడెన్‌ డెత్‌లో సంగీత గోల్‌ కొట్టడంలో విఫలం కాగా జర్మనీకి చెందిన జిమెర్మన్‌ గోల్‌ చేయడంతో భారత్‌ ఓటమిపాలైంది. 2006నుంచి ఇప్పటివరకు జర్మనీజట్టు జరిగిన ముఖాముఖి పోరులో భారత్‌ 4మ్యాచుల్లో ఓడి మరో 2మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మరో పోటీలో అమెరికా జట్టు 2-1గోల్స్‌ తేడాతో జపాన్‌ను చిత్తుచేసి ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో గెలుపుతో జర్మనీ, అమెరికా జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. ఆదివారం జరిగే 3వ స్థానం పోటీలో భారతజట్టు జపాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌కు పారిస్‌ ఒలింపిక్‌ బెర్త్‌ దక్కనుంది.

➡️