స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్‌ కుదేల్‌

Mar 7,2024 22:30 #Sports

– కుల్దీప్‌కు ఐదు, అశ్విన్‌కు నాలుగు వికెట్లు

– జైస్వాల్‌, రోహిత్‌ అర్ధసెంచరీలు

– ఇంగ్లండ్‌ 218/10, భారత్‌ 135/1

ధర్మశాల: ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత స్పిన్నర్లు ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ స్పిన్నర్లు కుల్దీప్‌, అశ్విన్‌ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 218పరుగులకు కుప్పకూలింది. కుల్దీప్‌ యాదవ్‌(5/72)కి తోడు వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌(4/51) బౌలింగ్‌లో మెరిసారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌..

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్‌ (57; 5ఫోర్లు, 3సిక్సర్లు), రోహిత్‌ శర్మ (52నాటౌట్‌; 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. తొలుత ఇంగ్లండ్‌.. సహజసిద్ధమైన(బజ్‌బాల్‌) ఆటకు విరుద్ధంగా ఆడింది. ధాటిగా ఆడే జాక్‌ క్రాలే(79), బెన్‌ డకెట్‌(58)లు తొలి వికెట్‌కు 17 ఓవర్లలో 64 పరుగులు జోడించారు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి బెన్‌ డకెట్‌ను కుల్దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ జట్టు వికెట్ల పతనం మొదలైంది. కుల్దీప్‌ బౌలింగ్‌లోనే ఒలీ పోప్‌(11)ను ధృవ్‌ జురెల్‌ స్టంపౌట్‌ చేశాడు. లంచ్‌లోపు ఆ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. లంచ్‌ తర్వాత సెంచరీ దిశగా సాగుతున్న జాక్‌ క్రాలేను కుల్దీప్‌ బౌల్డ్‌ చేశాడు. జో రూట్‌(26), వందో టెస్టు ఆడుతున్న బెయిర్‌ స్టో(29, 2ఫోర్లు, 2సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. బెయిర్‌ స్టోను కూడా కుల్దీప్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లండ్‌ 43 ఓవర్లకు 3వికెట్లు కోల్పోయి 175పరుగులతో పటిష్టంగా ఉంది. ఆ తర్వాత కేవలం 6 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183-8గా నిలిచింది. కుల్దీప్‌ టాపార్డర్‌, మిడిలార్డర్‌ నేలకూల్చగా.. అశ్విన్‌ టెయిలెండర్ల పనిపట్టాడు. చివర్లో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌(24) రాణించడంతో ఆ జట్టు 200 మార్కు దాటింది. టీ విరామానికి ఇంగ్లండ్‌ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా ఓపెనర్లు జైస్వాల్‌-రోహిత్‌ ఇంగ్లండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పేసర్లు ఆండర్సన్‌, మార్క్‌ వుడ్‌తోపాటు స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ వేసిన బంతులను ఎడాపెడా కొడుతూ స్కోర్‌బోర్డును పరుగెత్తించారు. బషీర్‌ వేసిన 10వ ఓవర్లో జైస్వాల్‌ మూడు సిక్సర్లు బాదగా.. రోహిత్‌ వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. బషీర్‌ వేసిన 15వ ఓవర్లోనే మూడో బంతికి ఫోర్‌ కొట్టి జైస్వాల్‌.. టెస్టులలో వినోద్‌ కాంబ్లీ(14 ఇన్నింగ్స్‌) తర్వాత అత్యంత వేగంగా (16 ఇన్నింగ్స్‌లలో) వెయ్యి పరుగులు పూర్తిచేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. బషీర్‌ వేసిన 21వ ఓవర్లో రెండో బంతికి ఫోర్‌ కొట్టి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న జైస్వాల్‌.. నాలుగో బంతికి స్టంపౌట్‌ అయ్యాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ (104) భాగస్వామ్యం నెలకొల్పారు. మరి కొద్దిసేపటికే రోహిత్‌ కూడా అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసేటప్పటికీ రోహిత్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (26నాటౌట్‌ 2ఫోర్లు, 2సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. భారత్‌ ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది.

కోహ్లి రికార్డు బ్రేక్‌ చేసిన జైస్వాల్‌…

టెస్టుల్లో యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఓ రికార్డును నెలకొల్పాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత తొలి బ్యాటర్‌గా జైస్వాల్‌ రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి నాలుగు టెస్టుల్లోనే జైస్వాల్‌ 655 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న (655పరుగులు) రికార్డును తాజాగా జైస్వాల్‌ ఐదో టెస్ట్‌లో బ్రేక్‌ చేశాడు. 2016లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ 655 పరుగులు చేశాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (57) అర్ధ శతకంతో రాణించి ఒక టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు(712) చేసిన భారత ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో 700కు పైగా పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగానూ జైస్వాల్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సునీల్‌ గవాస్కర్‌ వెస్టిండీస్‌పై రెండుసార్లు (774పరుగులు, 1971.. 732 పరుగులు.. 1979) అగ్రస్థానంలో ఉన్నాడు.

స్కోర్‌బోర్డు…

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (బి)కుల్దీప్‌ 79, డక్కెట్‌ (సి)శుభ్‌మన్‌ (బి)కుల్దీప్‌ 27, పోప్‌ (స్టంప్‌)జురెల్‌ (బి)కుల్దీప్‌ 11, రూట్‌ (ఎల్‌బి)జడేజా 26, బెయిర్‌స్టో (సి)జురెల్‌ (బి)కుల్దీప్‌ 29, స్టోక్స్‌ (ఎల్‌బి)కుల్దీప్‌ 0, ఫోక్స్‌ (బి)అశ్విన్‌ 24, హార్ట్‌లీ (సి)పడిక్కల్‌ (బి)అశ్విన్‌ 6, మార్క్‌ వుడ్‌ (సి)రోహిత్‌ (బి)అశ్విన్‌ 0, బషీర్‌ (నాటౌట్‌) 11, ఆండర్సన్‌ (సి)పడిక్కల్‌ (బి)అశ్విన్‌ 0, అదనం 5. (57.4ఓవర్లలో ఆలౌట్‌) 218పరుగులు.

వికెట్ల పతనం: 1/64, 2/100, 3/137, 4/175, 5/175, 6/175, 7/183, 8/183, 9/218, 10/218

బౌలింగ్‌: 13-2-51-0, సిరాజ్‌ 8-1-24-0, అశ్విన్‌ 11.4-1-51-4, కుల్దీప్‌ 15-1-72-5, జడేజా 10-2-17-1.

➡️