చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్‌

Jun 25,2024 23:20 #Sports

తొలిసారి టి20 ప్రపంచకప్‌ సెమీస్‌ బెర్త్‌
నిర్ణయాత్మక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8పరుగుల తేడాతో గెలుపు
కింగ్స్‌టౌన్‌: టి20 ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరి ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ చరిత్రలో ఆఫ్ఘన్‌ జట్టు సెమీస్‌కు చేరడం ఇదే ప్రథమం. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 8పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై సంచలన విజయం సాధించింది. సూపర్‌ా8 మ్యాచుల్లో భాగంగా తొలుత ఆస్ట్రేలియాకు ఝలక్‌ ఇచ్చిన ఆఫ్ఘన్‌ జట్టు మంగళవారం బంగ్లాదేశ్‌ను ఓడించి దర్జాగా సెమీస్‌కు చేరింది. దీంతో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాతోపాటు బంగ్లాదేశ్‌ సూపర్‌ా8కే పరిమితమయ్యాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 115పరుగులే చేసింది. గుర్బాజ్‌ (43) టాప్‌ స్కోరర్‌. ఇబ్రహీం జద్రాన్‌(18), రషీద్‌ ఖాన్‌(19నాటౌట్‌) విలువైన పరుగులు సాధించారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాను 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్‌ చేసింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. టార్గెట్‌ను 114 పరుగులుగా నిర్ణయించారు. అఫ్గాన్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సూపర్‌-8 గ్రూప్‌ా1 నుంచి భారత్‌తో పాటు అఫ్గాన్‌ సగర్వంగా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్లింది. గురువారం ఉదయం 6 గంటలకు దక్షిణాఫ్రికాతో తొలి సెమీస్‌లో అఫ్గాన్‌ తలపడనుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు భారతజట్టు ఇంగ్లాండ్‌తో రెండో సెమీస్‌లో తలపడనుంది. సూపర్‌-8లో మూడు జట్ల భవితవ్యం తేల్చే చివరి మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ టోర్నమెంట్‌లో సంచలన విజయాలు నమోదు చేస్తున్న అఫ్గాన్‌ ఈసారి కూడా పట్టు వదల్లేదు. లక్ష్యం చిన్నదైనా సరే బంగ్లాను కట్టడి చేసి విజయం సాధించింది.
రషీద్‌, నవీనుల్‌ అద్భుతం..
బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (54) చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నా తన జట్టును గెలిపించలేకపోయాడు. బంగ్లాదేశ్‌ నిష్క్రమణ 13 ఓవర్లప్పుడే తేలినా.. అఫ్గాన్‌ ఆశలకు గండి కొట్టేలా అనిపించింది. అయితే, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (4/23), నవీనుల్‌ హక్‌ (4/26), ఫరూఖి (1/15), గుల్బాదిన్‌ (1/5) కీలక సమయంలో చెలరేగిపోయారు. బంగ్లాను ఒత్తిడికి గురి చేస్తూ వికెట్లు పడగొట్టారు. లిటన్‌తోపాటు సౌమ్యా సర్కార్‌ (10), తౌహిద్‌ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నవీనుల్‌ హక్‌కు లభించింది. ఈ టోర్నీలోనే ఆఫ్ఘన్‌ జట్టు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలను ఓడించిన సంగతి తెలిసిందే.
ఆఫ్ఘనిస్తాన్‌లో అంబరాన్నంటిన సంబరాలు
ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు టి20 ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరడంతో అక్కడి క్రికెట్‌ అభిమానులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకుంటున్నారు. వేల సంఖ్యలో వీధుల్లో ర్యాలీ తీశారు. టి20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గిన ఆ జట్టు.. సెమీస్‌లోకి ప్రవేశించింది. ఆ అద్భుత సందర్భాన్ని ఆఫ్ఘన్‌ క్రీడాభిమానులు ఫుల్‌ ఎంజారు చేశారు. జనం భారీ సంఖ్యలో ర్యాలీ తీస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమ్‌ బస్సులో వెళ్తున్న ఆఫ్ఘన్‌ క్రికెటర్లు కూడా పార్టీ చేసుకున్నట్లు కొన్ని వీడియోలు వచ్చాయి. నాన్‌గర్హర్‌ పట్టణంలో భారీ సంఖ్యలో క్రికెట్‌ ప్రేమికులు ర్యాలీ తీశారు. జీవిత కల నెరవేరినట్లు ఆఫ్ఘన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. టోర్నీలో స్టార్ట్‌ చేసిన తీరు బాగుందని, న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత తమకు నమ్మకం పెరిగిందన్నాడు. ఆ ఫీలింగ్‌ను వర్ణించే మాటలు లేవన్నాడు. ఈ వికెట్‌పై 135 స్కోరు పర్వాలేదనుకున్నామని, 20 రన్స్‌ తక్కువే అయినా, ఇదంతా మైండ్‌సెట్‌కు సంబంధించిన ఆట అని రషీద్‌ తెలిపాడు. ఆఫ్ఘన్‌ జట్టు సభ్యులపై కెప్టెన్‌ ప్రశంసలు కురిపించాడు. టీ20 లైనప్‌ చాలా బలంగా ఉందన్నాడు.
స్కోర్‌బోర్డు…
అఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)సౌమ్య సర్కార్‌ (బి)రిషాద్‌ హొసైన్‌ 43, ఇబ్రహీం జడ్రాన్‌ (సి)తంజిమ్‌ హసన్‌ (బి)రిషాద్‌ హొసైన్‌ 18, అజ్మతుల్లా (సి)లింటన్‌ దాస్‌ (బి)ముస్తాఫిజుర్‌ 10, గులాబుద్దిన్‌ (సి)సౌమ్య సర్కార్‌ (బి)రిషాద్‌ హొసైన్‌ 4, నబి (సి)శాంటో (బి)తస్కిన్‌ అహ్మద్‌ 1, కరీమ్‌ జనత్‌ (నాటౌట్‌) 7, రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 19, అదనం 13. (20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 115పరుగులు.
వికెట్ల పతనం: 1/59, 2/81, 3/88, 4/89, 5/93
బౌలింగ్‌: తంజిమ్‌ హసన్‌ 4-0-36-0, తస్కిన్‌ అహ్మద్‌ 4-1-12-1, షకీబ్‌ 4-0-19-0, ముస్తాఫిజుర్‌ 4-0-17-1, రిషాద్‌ హొసైన్‌ 4-0-26-3,
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లింటన్‌ దాస్‌ (నాటౌట్‌) 54, తంజిద్‌ హసన్‌ (ఎల్‌బి)ఫారుఖీ 0, నజ్ముల్‌ (సి)నబి (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 5, షకీబ్‌ (సి అండ్‌ బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 0, సౌమ్య సర్కార్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 10, తౌహిద్‌ హృదరు (సి)ఇబ్రహీం జడ్రాన్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 14, మహ్మదుల్లా (సి)మహ్మద్‌ (బి)రిషాద్‌ ఖాన్‌ 6, రిషాద్‌ హొసైన్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 0, తంజిమ్‌ హసన్‌ (సి)నబి (బి)గులాబుద్దిన్‌ 3, తస్కిన్‌ అహ్మద్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 2, ముస్తాఫిజుర్‌ (ఎల్‌బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 0, అదనం 11. (17.5ఓవర్లలో ఆలౌట్‌) 105పరుగులు.
వికెట్ల పతనం: 1/16, 2/23, 3/23, 4/48, 5/64, 6/80, 7/80, 8/92, 9/105, 10/105
బౌలింగ్‌: నవీన్‌-ఉల్‌-హక్‌ 3.5-0-26-4, ఫారుఖీ 2-0-15-1, మహమ్మద్‌ నబి 2-0-15-0, రషీద్‌ ఖాన్‌ 4-0-23-4, నూర్‌ అహ్మద్‌ 4-0-13-0, గులాబుద్దిన్‌ 2-0-5-1.

➡️