అమెరికా సంచలనం

May 22,2024 23:15 #Sports

బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
హోస్టన్‌(అమెరికా): టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న అమెరికా జట్టు ఆసియా జట్టు బంగ్లాదేశ్‌కు ఝలక్‌ ఇచ్చింది. ఇరుజట్ల మధ్య జరుగుతున్న మూడు టి20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన తొలి టి20లో అమెరికా జట్టు ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. బంగ్లాదేశ్‌ జట్టు 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 153పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని అమెరికా జట్టు 19.3ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 156పరుగులు చేసి గెలిచింది. హౌస్టన్‌ వేదికగా జరిగిన తొలి టి20లో టాస్‌ గెలిచిన ఆతిథ్య అమెరికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు లిటన్‌ దాస్‌(14), సౌమ్య సర్కార్‌(20) వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ నజ్ముల్‌ హుసేన్‌ షాంటో(3) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత తౌహిద్‌ హృదోరు ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. 47 బంతుల్లో 58 పరుగులతో, మహ్మదుల్లా 31పరుగులతో రాణించారు. దీంతో బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని అమెరికా 19.3 ఓవర్లలోనే పూర్తిచేసింది. స్టీవెన్‌ టేలర్‌(28), ఆండ్రీస్‌ గౌస్‌(23), కోరే ఆండర్సన్‌(34నాటౌట్‌), హర్మీత్‌ సింగ్‌ దంచికొట్టారు. ముఖ్యంగా హర్మీత్‌ కేవలం 13 బంతుల్లోనే 33 పరుగులు సాధించి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో మూడు టి20ల సిరీస్‌లో అమెరికా 1-0 ఆధిక్యతలో నిలిచింది.

➡️