IPL-నేడు ఐపిఎల్‌ లో మరో భారీ మ్యాచ్‌

May 6,2024 11:54 #Another, #big match, #IPL today

ముంబయి : ఐపిఎల్‌లో నేడు మరో భారీ మ్యాచ్‌ జరుగనుంది. ముంబయి హోంగ్రౌండ్‌ అయిన వాంఖడేలో సోమవారం రాత్రి 7: 30 గంటలకు ప్రారంభం కానున్న ఆటలో … స్టార్లతో నిండిన ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ముంబయి వరుస చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరింది. ఈ సీజన్‌లో ముంబయి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే గెలుపొంది ఆరు పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ముంబయి ఈ సీజన్‌లో మరో మూడు మ్యాచ్‌లు (సన్‌రైజర్స్‌, కేకేఆర్‌, లక్నో) ఆడాల్సి ఉంది.

సన్‌రైజర్స్‌ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ప్రధాన పోటీదారుగా ఉంది. సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచి 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఆరెంజ్‌ ఆర్మీ ఈ సీజన్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు (ముంబై, లక్నో, గుజరాత్‌, పంజాబ్‌) ఆడాల్సి ఉంది. ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే సన్‌రైజర్స్‌ ఇకపై జరిగే అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ : ఐపిఎల్‌లో ముంబై, సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 12, సన్‌రైజర్స్‌ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. చివరిసారిగా ఈ రెండు జట్ల మధ్య తలపడిన మ్యాచ్‌లో అతి భారీ స్కోర్లు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 31 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ట్రవిస్‌ హెడ్‌ (62), అభిషేక్‌ శర్మ (63), మార్క్రమ్‌ (42 నాటౌట్‌), క్లాసెన్‌ (80 నాటౌట్‌) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్‌ సైతం ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌ చేసి సన్‌రైజర్స్‌ శిబిరంలో దడ పుట్టించింది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. రోహిత్‌ శర్మ (26), ఇషాన్‌ కిషన్‌ (34), నమన్‌ ధిర్‌ (30), తిలక్‌ వర్మ (64), హార్దిక్‌ పాండ్యా (24), టిమ్‌ డేవిడ్‌ (42 నాటౌట్‌), రొమారియో షెపర్డ్‌ (15 నాటౌట్‌) తలో చేయి వేసి సన్‌రైజర్స్‌ను భయపెట్టారు.

తుది జట్లు (అంచనా)..
ముంబై ఇండియన్స్‌: ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), నమన్‌ ధిర్‌, టిమ్‌ డేవిడ్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, పీయూష్‌ చావ్లా, జస్ప్రీత్‌ బుమ్రా, నువాన్‌ తుషార, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ : నేహాల్‌ వధేరా

సన్‌రైజర్స్‌ : ట్రవిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌కీపర్‌), నితీష్‌ రెడ్డి, అబ్దుల్‌ సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌, మార్కో జాన్సెన్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌, టి నటరాజన్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ : జయదేవ్‌ ఉనద్కత్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

➡️