Australian Open : క్వార్టర్స్‌కు అల్కరాజ్‌, మెద్వదెవ్‌

Jan 22,2024 21:03 #Sports, #Tennis
  • డబుల్స్‌లో బొప్పన్న జోడీ కూడా..
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి 2వ సీడ్‌, స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్‌, 3వ సీడ్‌, మెద్వదెవ్‌(రష్యా), 6వ సీడ్‌, జర్మనీకి చెందిన జ్వెరేవ్‌ ప్రవేశించారు. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో అల్కరాజ్‌ 6-4, 6-4, 6-0తో అన్‌సీడెడ్‌ కెక్‌మనోవిక్‌ (క్రొయేషియా)ను చిత్తుచేశాడు. మరో పోటీలో జ్వెరేవ్‌ ఐదుసెట్ల హోరాహోరీ పోరులో 19వ సీడ్‌ నొర్రీ(బ్రిటన్‌)ను ఓడించి ఊపిరి పీల్చుకున్నాడు. పోటాపోటీగా సాగిన నాల్గోరౌండ్‌ పోటీలో జ్వెరేవ్‌ 7-5, 3-6, 6-3, 4-6, 7-6(10-3)తో నొర్రిని ఓడించాడు. ఇక 9వ సీడ్‌, పోలండ్‌కు చెందిన హుర్క్‌రాజ్‌ 7-6(8-6), 7-6(7-3), 6-4తో ఆర్ధర్‌ కాజుక్స్‌(ఫ్రాన్స్‌)ను, 3వ సీడ్‌ మెద్వదెవ్‌ 6-3, 7-6(7-4), 7-5, 6-1 ఎన్‌. బోర్గెన్‌(పోర్చుగల్‌)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరారు.

అజరెంకా, స్విటోలినా ఔట్‌..

మహిళల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో ముగ్గురు సీడెడ్‌ క్రీడాకారిణులు అన్‌సీడెడ్ల చేతిలో ఓటమిపాలయ్యారు. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో 18వ సీడ్‌ అజరెంకా(రష్యా), 19వ సీడ్‌ స్విటోలినా(ఉక్రెయిన్‌)తోపాటు 26వ సీడ్‌ పావోలిని(ఇటలీ) అన్‌సీడెడ్ల చేతిలో వరుససెట్లలో ఓడారు. అజరెంకా 6-7(6-8), 4-6తో యాస్టెమ్క్సా(ఉక్రెయిన్‌), స్విటోలినా 0-3తో నొస్కోవా(చెక్‌)తో వెనుకబడి ఉన్న దశలో గాయంతో మ్యాచ్‌ మధ్యలోనే నిష్క్రమించింది. ఇక పావోలిని 4-6, 2-6తో కలిన్క్సయా(రష్యా) చేతిలో పరాజయాన్ని చవిచూసింది. మరో పోటీలో 12వ సీడ్‌ జంగ్‌(చైనా) 6-0, 6-3తో డోడిన్‌(ఫ్రాన్స్‌)ను చిత్తుచేసి క్వార్టర్స్‌కు చేరింది.

క్వార్టర్స్‌కు బొప్పన్న జోడీ..

పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ఇండో-ఆసీస్‌ జోడీ ప్రవేశించింది. 2వ సీడ్‌గా బరిలోకి దిగిన రోహన్‌ బొప్పన్న(భారత్‌)-ఎబ్డెన్‌(ఆస్ట్రేలియా) జోడీ మూడోరౌండ్‌లో 7-6(10-8), 7-6(7-4)తో 14వ సీడ్‌ డబ్ల్యు కూల్హోప్‌(ఫ్రాన్స్‌)-మెక్టిన్‌(క్రొయేషియా) జంటపై విజయం సాధించింది. క్వార్టర్‌ఫైనల్లో భారత్‌-ఎబ్డెన్‌ జంట 6వ సీడ్‌ గోంజాలెజ్‌-మోల్టెనిలతో తలపడనున్నారు.

క్వార్టర్‌ఫైనల్స్‌సింగిల్స్‌ పురుషులు 

జకోవిచ్‌ × ఫ్రిట్జ్‌

సిన్నర్‌ × రుబ్లేవ్‌

హుర్క్‌రాజ్‌ × మెద్వదెవ్‌

జ్వెరేవ్‌ × అల్కరాజ్‌

 

క్వార్టర్‌ఫైనల్స్‌సింగిల్స్‌ మహిళలు

నొస్కోవా × యాస్టెమ్క్సా

కలిన్క్సయా × జెంగ్‌

కోస్ట్యుక్‌ × గాఫ్‌

క్రేజికోవా × సబలెంకా

➡️