ఫుట్‌బాల్‌ ఆటకు ఛెత్రీ గుడ్‌బై

May 17,2024 08:07 #Foot Ball, #Sports, #Sunil Chhetri
  • ట్విటర్‌(ఎక్స్‌)లో వీడియో పోస్ట్‌
  • కువైట్‌తో మ్యాచ్‌ చివరిదంటూ ప్రకటన

కోల్‌కతా : భారత దిగ్గజ ఫుట్‌బాల్‌ ఆటగాడు, కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి(39) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు గుడ్‌బై చెప్పాడు. స్ట్రయికర్‌గా 19ఏళ్లపాటు భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడిన ఛెత్రీ ట్విటర్‌(ఎక్స్‌)లో గురువారం పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని వెల్లడించాడు. జూన్‌ 6న కోల్‌కతా వేదికగా కువైట్‌తో జరిగే ఫిఫా వరల్డ్‌ కప్‌ అర్హత మ్యాచ్‌ చివరిదంటూ ఆ వీడియోలో తెలిపాడు. ఛెత్రి పోస్టు చేసిన వీడియో 9.51 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఆ వీడియోకు ఛెత్రి ‘ఐ ఉడ్‌ లైక్‌ టు సే సమ్‌థింగ్‌’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. భారత్‌ తరఫున 150అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఛెత్రీ.. 94 గోల్స్‌ కొట్టాడు. 2005, జూన్‌ 12న పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీల్లో అరంగేట్రం చేసిన ఛెత్రీ… తొలి గోల్‌ను ఆ జట్టుపైనే కొట్టాడు. అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సీ(180మ్యాచుల్లో 106గోల్స్‌), పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో(205మ్యాచుల్లో 128 గోల్స్‌) తర్వాత అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మూడో ప్లేయర్‌ ఛెత్రీ మాత్రమే. ఛెత్రీ సారథ్యంలో భారత్‌ 2008లో ఎఫ్‌సి ఛాలెంజర్స్‌ కప్‌, 2011, 2015లో సాఫ్‌ ఛాంపియన్‌షిప్‌, 2007, 2009, 2012లో నెహ్రూ కప్‌లను చేజిక్కించుకుంది. అలాగే ఇంర్నేషనల్‌ కప్‌ను భారతజట్టు 2017, 2018లో చేజిక్కించుకోవడంలో ఛెత్రీ కీలకపాత్ర పోషించాడు. ఆరుసార్లు ఎఐఎఫ్‌ఎఫ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ఇయర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఛెత్రీకి భారత ప్రభుత్వం 2011లో అర్జున, 2019లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.

 

➡️