వార్నర్‌ సెంచరీ

Dec 14,2023 22:20 #Cricket, #Sports, #Test Cricket

ఆస్ట్రేలియా 346/5

పెర్త్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌ ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(164) సెంచరీతో కదం తొక్కాడు. వార్నర్‌కి తోడు ఉస్మాన్‌ ఖవాజా(41), స్టీవ్‌ స్మిత్‌(31), హెడ్‌(40) కూడా రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఓపెనర్లు వార్నర్‌ాఖవాజా పాక్‌ బౌలర్లను ఉతికారేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షాహీన్‌ ఆఫ్రిది విడదీశాడు. ఖవాజా ఔటయ్యాక.. వార్నర్‌ మరింత దూకుడుగా ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో పాక్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. మార్నస్‌ లబూషేన్‌(16), స్టీవ్‌ స్మిత్‌(31)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన వార్నర్‌ 125బంతుల్లో సెంచరీ సాధించాడు. డబుల్‌ సెంచరీకి చేరువవుతున్న అతడిని అమీర్‌ జమాల్‌ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన మార్ష్‌, క్యారీ మరో వికెట్‌ పడకుండా చూసుకున్నారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మిచెల్‌ మార్ష్‌(15), వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ(14) క్రీజులో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో అమీర్‌ జమాల్‌కు రెండు, షాహిన్‌ అఫ్రిది, షాహజాద్‌, అష్రఫ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

➡️