IND VS ENG : ముగిసిన తొలిసెషన్‌ : టీమిండియా స్కోర్‌ 103/2

విశాఖ : విశాఖలో డాక్టర్‌ వైఎస్సార్‌ స్టేడియం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు తొలి సెషన్‌ ముగిసింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ చేశారు. క్రీజులో జైస్వాల్‌ (51) సహా శ్రేయస్‌ అయ్యర్‌ (4) ఉన్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (14) మరోసారి నిరాశపరిచారు. శుభమాన్‌ గిల్‌ (34) పరుగులు చేశారు. రెండో టెస్టులో టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. ఓపెనర్లు రోహిత్‌, జైస్వాల్‌లు ఇన్నింగ్స్‌ ఆరంభంలో నిదానంగా ఆడారు. ఇద్దరూ బౌండరీలకు పోకుండా.. సింగిల్స్‌ తీశారు. ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌లో రోహిత్‌కు అరంగేట్ర స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ పెవిలియన్‌ చేర్చారు. ప్లాన్‌గా లెగ్‌ స్లిప్‌ ఫీల్డర్‌ను పెట్టుకున్నారు. బంతి అనుహ్యంగా టర్న్‌ అయ్యి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని లెగ్‌ స్లిప్‌ ఫీల్డర్‌ ఒలీ పోప్‌ చేతికి చిక్కింది. 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 14 పరుగులు చేసి పరాజయం చవిచూశారు. బషీర్‌కు ఇదే తొలి టెస్టు వికెట్‌ కావడం గమనార్హం. రోహిత్‌ శర్మ తరువాత క్రీజులోకి వచ్చిన శభ్‌మన్‌ గిల్‌ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా ఆపై వేగం పెంచారు. మరోవైపు జైస్వాల్‌ కూడా దూకుడుగా ఆడారు. దీంతో భారత్‌ స్కోర్‌ బోర్డు ఊపందుకుంది. అయితే వరుసగా బౌండరీలు సాధిస్తూ జోరుమీదున్న గిల్‌ను జేమ్స్‌ అండర్సన్‌ వెనక్కి పంపారు. బౌండరీతో జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లు అండర్సన్‌, బషీర్‌ చెరొక వికెట్‌ తీశారు.

➡️