ఢిల్లీ పై పైకి.. ఫ్రేజర్‌ ధనా ధన్‌..

Apr 27,2024 23:54 #Sports

ఉత్కంఠపోరులో ముంబయిపై 10 పరుగుల తేడాతో గెలుపు
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో మరో ఉత్కంఠ మ్యాచ్‌ జరిగింది. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఢిల్లీాముంబయి జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి జట్టు 20ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్లు కోల్పోయి 247పరుగులు చేసింది. దీంతో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. భారీ ఛేదనలో భాగంగా ముంబయి టాపార్డర్‌ ఫ్లాప్‌ షోతో నిరాశపరిచారు. ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ ధాటికి 45 పరుగులకే ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌(20), రోహిత్‌ శర్మ(8)లు పెవిలియన్‌ చేరారు. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(26)ను వెనక్కి పంపి ముంబయిని ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే.. తిలక్‌ వర్మ(63), హార్దిక్‌ పాండ్యా(44)లు ధనాధన్‌ ఆడి స్కోర్‌ బోర్డును పరుగు పెట్టించారు. ఈ జోడీని విడదీసేందుకు పంత్‌.. కుర్రాడు రసిక్‌ దార్‌ సలాంకు బంతి అందించి విజయం సాధించాడు. రసిక్‌ ఒకే ఓవర్లో పాండ్యా, నేహల్‌ వధేరా(4)ను ఔట్‌ చేసి ముంబయిని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత వచ్చిన టిమ్‌ డేవిడ్‌(37) అండగా తిలక్‌ బౌండరీల మోతతో ముంబయిలో గెలుపు దిశగా నడిపారు. 18వ ఓవర్‌లో ముకేశ్‌ ఎల్బీగా డేవిడ్‌ను వెనక్కి పంపగా.. ఆఖరి ఓవర్లో 25 పరుగులు అవసరం కాగా.. తిలక్‌ తొలి బంతికే రనౌటయ్యాడు. ల్యూక్‌ వుడ్‌(9), పీయూష్‌ చావ్లా(10)లు చెరొక బౌండరీ బాదారు. ఆఖరి బాల్‌కు చావ్లా ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లు సలామ్‌కు మూడు, ఖలీల్‌ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి.
15బంతుల్లో ఫ్రేజర్‌ అర్ధసెంచరీ…
ఢిల్లీ ఓపెనర్‌ ఫ్రేజర్‌(84) ముంబయి పేసర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రాతో సహా అందర్నీ ఉతికారేస్తూ కేవలం 15బంతుల్లోనే అర్ధసెంచరీ బాదేశాడు. అతడికి అండగా అభిషేక్‌ పొరెల్‌(36) చెలరేగడంతో తొలి వికెట్‌కు వీరు 114 పరుగులు జోడించారు. 27బంతుల్లో 11ఫోర్లు, 6సిక్సర్లతో ముంబయి బౌలర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాడు. ఆ తర్వావ వచ్చిన పంత్‌(29).. హోప్‌(41)లు బాదేశారు. చివర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌(48 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ల్యూక్‌ వుడ్‌ వేసిన 18వ ఓవర్‌లో రెచ్చిపోయిన స్టబ్స్‌ ఒక్క బంతిని వదలకుండా వరుసగా.. 4, 4, 6, 4, 4, 4 బాదేశాడు. ఆ తర్వాత పంత్‌ ఔటైనా.. స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ (11 నాటౌట్‌)లు ధనాధన్‌ ఆడి ఢిల్లీకి భారీ స్కోర్‌ అందించారు. ముంబయి బౌలర్లు వుడ్‌, బుమ్రా, చావ్లా, నబిలకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫ్రేజర్‌కు దక్కింది.
స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: ఫ్రేజర్‌ (సి)నబి (బి)చావ్లా 84, పోరెల్‌ (సి)ఇషాన్‌ (బి)నబి 36, హోప్‌ (సి)తిలక్‌ వర్మ (బి)లూకే వుడ్‌ 41, పంత్‌ (సి)రోహిత్‌ (బి)బుమ్రా 29, స్టబ్స్‌ (నాటౌట్‌) 48, అక్షర్‌ (నాటౌట్‌) 11, అదనం 8, (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 257పరుగులు.
వికెట్ల పతనం: 1/114, 2/127, 3/180, 4/235
బౌలింగ్‌: లూకే వుడ్‌ 4-0-68-1, బుమ్రా 4-0-35-1, తుషారా 4-0-56-0, చావ్లా 4-0-36-1, హార్దిక్‌ 2-0-41-0, నబి 2-0-20-1.
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి)అక్షర్‌ (బి)ముఖేష్‌ 20, రోహిత్‌ శర్మ (సి)హోప్‌ (బి)ఖలీల్‌ అహ్మద్‌ 8, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి)విలియమ్స్‌ (బి)ఖలీల్‌ అహ్మద్‌ 26, తిలక్‌ వర్మ (రనౌట్‌) సుమిత్‌ కుమార్‌/పంత్‌ 63, హార్దిక్‌ పాండ్య (సి)ముఖేశ్‌ కుమార్‌ (బి)ఆర్‌. సలామ్‌ 46, వథేరా (సి)పంత్‌ (బి)ఎస్‌.సలామ్‌ 4, టిమ్‌ డేవిడ్‌ (ఎల్‌బి)ముఖేశ్‌ కుమార్‌ 37, మహ్మద్‌ నబి (సి)హోప్‌ (బి)ఎస్‌.సలామ్‌ 7, పియూష్‌ చావ్లా (సి)హోప్‌ (బి)ముఖేష్‌ కుమార్‌ 10, లూకే ఉడ్‌ (నాటౌట్‌) 9, అదనం 17. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 247పరుగులు.
వికెట్ల పతనం: 1/35, 2/45, 3/65, 4/136, 5/140, 6/210, 7/233, 8/234, 9/247
బౌలింగ్‌: విలియమ్స్‌ 3-0-34-0, ఖలీల్‌ అహ్మద్‌ 4-0-45-2, ముఖేశ్‌ కుమార్‌ 4-0-59-3, కుల్దీప్‌ 3-0-47-0, అక్షర్‌ పటేల్‌ 2-0-24-0, ఆర్‌. సలామ్‌ 4-0-34-3.

➡️