కప్పు ఎవరికి దక్కేనో !

  • ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు
  • మూడో టైటిల్‌పై ఆతిథ్య భారత్‌ గురి
  • ఆరో ట్రోఫీ రేసులో ఆస్ట్రేలియా

అహ్మదాబాద్‌ మొతెరా మైదానం. 1.30 లక్షల మంది అభిమానులు. బరిలో 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్లు. లక్ష్యం ఐసీసీ ప్రపంచకప్‌ టైటిల్‌. ఆతిథ్య భారత్‌ మూడోసారి ఈ కప్పు కొట్టాలని తలపిస్తుండగా, ఆసీస్‌ ఏకంగా సిక్సర్‌ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఓటమెరుగని జైత్రయాత్రతో ఫైనల్లో ఫేవరేట్‌గా భారత్‌ నిలువగా.. ఈ టోర్నీల్లో విజయం సాధించటం తెలిసిన ఆసీస్‌ మరోవైపు. భారత్‌, ఆస్ట్రేలియా ఐసీసీ 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు. అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. అజేయ జట్టు ఆతిథ్య భారత్‌ సొంత అభిమానుల నడుమ దేశం గర్వపడే ప్రదర్శన చేయాలని చూస్తోంది. 120 కోట్ల భారతీయుల గుండె చప్పుడు నేడు మొతెరాలో వినిపిండనుండగా.. ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టాలని రోహిత్‌సేన తహతహ లాడుతోంది. ప్రపంచకప్‌లో పది మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా నేడు 11వ గెలుపుతో ప్రపంచకప్‌ ట్రోఫీకి చేరువయ్యేందుకు ఎదురు చూస్తోంది.
ఐసీసీ ట్రోఫీలు నెగ్గటం ఎరిగిన జట్టు ఆస్ట్రేలియా. ఐదుసార్లు ప్రపంచకప్‌ సాధించిన ఆసీస్‌ ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను సైతం సొంతం చేసుకుంది. కంగారూల స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరకపోయినా.. టైటిల్‌ పోరులో బరిలో నిలిచింది అరివీర భయంకర ఆస్ట్రేలియా. ఆఖరు బంతి వరకు పోరాడటం తెలిసిన పాట్‌ కమిన్స్‌ నేడు టీమ్‌ ఇండియా అత్యంత కఠిన ప్రత్యర్థి.
అహ్మదాబాద్‌ : అదే జోరు.. రెట్టించిన ప్రేరణ : ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా ప్రశాంతత బాగా కలసొచ్చింది. నేడు టైటిల్‌ పోరు భావన అదనపు ఒత్తిడి దరిచేరకుంటే రోహిత్‌సేన ఓ మెట్టు ఎక్కినట్టే. బ్యాటింగ్‌ లైనప్‌లో అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిస్వార్థ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ కీలక సమయంలో తనదైన ధాటి చూపిస్తున్నాడు. విరాట్‌ కోహ్లి పది ఇన్నింగ్స్‌లో ఏకంగా ఎనిమిది 50 ప్లస్‌ స్కోర్లు సాధించాడు. వాంఖడేలో చారిత్రక 50వ వన్డే సెంచరీతో భీకర ఫామ్‌లో ఉన్నాడు. టాప్‌-3 దండయాత్రకు శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ తోడయ్యారు. అయ్యర్‌ సిక్సర్ల మోత మోగిస్తుండగా, రాహుల్‌ సరికొత్త పంథాలో చెలరేగుతున్నాడు. టాప్‌-5 బ్యాటర్ల మెరుపులతో అదనపు బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అవసరం ఇప్పటివరకు రాలేదు. నేడు ఆ అవసరం ఏర్పడినా.. సూర్య కుమార్‌ సిద్ధంగానే ఉన్నాడు. మహ్మద్‌ షమి ఆరు మ్యాచుల్లోనే 23 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. బుమ్రా, సిరాజ్‌ తోడుగా షమి నిప్పులు చెరుగుతున్నాడు. ఈ పేస్‌ త్రయాన్ని ఎదురించి ఏ టాప్‌ ఆర్డర్‌ నిలువలేదు. కుల్దీప్‌, జడేజా మాయజాలం సైతం మ్యాజిక్‌ షో తరహాలో నడుస్తోంది. సమిష్టిగా రాణిస్తున్న టీమ్‌ ఇండియాకు ప్రపంచకప్‌ ట్రోఫీ ప్రేరణ తోడైతే నేడు ప్రత్యర్థి నిలువగలదా?!
చరిత్ర తోడుగా..ఆసీస్‌: కంగారూలకు ప్రపంచకప్‌ ఆరంభం కలిసి రాలేదు. తొలి రెండు మ్యాచుల్లో ఓటములు. కానీ ఆ తర్వాత ఆ జట్టు పుంజుకుంది. వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది. ఓటమి తథ్యమనుకున్న మ్యాచుల్లోనూ అసమాన విజయాలు సాధించి ఆశ్చర్యపరిచింది. తాజాగా ఫైనల్లోనూ ఆ జట్టును తక్కువ అంచనా వేస్తుండగా.. అందరికీ షాక్‌ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. స్మిత్‌, లబుషేన్‌ అంచనాలను అందుకోలేదు. వార్నర్‌, హెడ్‌ దూకుడులో నిలకడ లేదు. మాక్స్‌వెల్‌ మెరుపులు పరిమితమే. బంతితోనూ కమిన్స్‌, స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ స్లో పిచ్‌పై ఏమాత్రం ప్రభావం చూపిస్తారో తెలియని అనిశ్చితి. అయినా, ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఒత్తిడిని ఎదుర్కొనే అలవాటు ఆసీస్‌ సొంతం. గత చరిత్ర తోడుగా నేడు టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
పిచ్‌, వాతావరణం : భారత్‌, పాకిస్థాన్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌ జరిగిన పిచ్‌నే ఫైనల్‌కు సిద్ధం చేశారు. పాకిస్థాన్‌ 191 పరుగులకే కుప్పకూలగా, 30.3 ఓవర్లలోనే భారత్‌ లాంఛనం ముగించింది. ఫైనల్లో మరీ స్వల్ప స్కోర్లు నమోదు కాకపోయినా.. 320 పైచిలుకు స్కోరు గెలుపు దీమా ఇవ్వగలదు. భారత్‌, ఆసీస్‌ టైటిల్‌ పోరుకు ఎటువంటి వర్షం సూచనలు లేవు. కానీ రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉండనుంది. మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రౌండ్‌ పచ్చికపై రసాయనాలు సైతం వాడారు. మ్యాచ్‌ ఆరంభంలో 33 డిగ్రీలు ఉండనున్న ఉష్ణోగ్రత.. రెండో ఇన్నింగ్స్‌ సమయంలో ఏకంగా 23 డిగ్రీలకు పడిపోనుంది.
తుది జట్లు (అంచనా) :
గ్రూప్‌ దశ ఐదో మ్యాచ్‌ నుంచి భారత జట్టులో మార్పులు లేవు. నేడు ఫైనల్లోనూ అదే ట్రెండ్‌ కొనసాగే వీలుంది. ప్రత్యర్థి ఆసీస్‌ కావటంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకునే యోచన ఉన్నప్పటికీ.. ఇద్దరు సీమర్లతో బరిలో దిగటం సైతం ప్రమాదకరమే. ఆస్ట్రేలియా సైతం తుది జట్టులో మార్పులపై ఆలోచన చేస్తోంది. మార్నస్‌ లబుషేన్‌ స్థానంలో మార్కస్‌ స్టోయినిస్‌ను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతోంది. కానీ స్లో పిచ్‌పై లబుషేన్‌ బ్యాటింగ్‌ నైపుణ్యం ఆసీస్‌కు అవసరం. దీంతో సెమీస్‌లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు టైటిల్‌ పోరుకు సిద్ధం కానున్నాయి.
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.
ఆస్ట్రేలియా : డెవిడ్‌ వార్నర్‌, ట్రావిశ్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ఆడం జంపా, జోశ్‌ హాజిల్‌వుడ్‌.

➡️