డ్రా దిశగా భారత్‌

Dec 24,2023 10:28 #Sports

-ఆస్ట్రేలియా మహిళల టెస్ట్‌నేటి తొలి సెషన్‌ కీలకం

ముంబయి: వాంఖడే స్టేడియంలో జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా మహిళల ఏకైక టెస్ట్‌ డ్రా దిశగా పయనిస్తోంది. మూడోరోజైన శనివారం తొలి, రెండో సెషన్లలో భారత మహిళా బౌలర్లు విఫలం కాగా.. మూడో సెషన్‌లో రాణించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు మూడోరోజు ఆట నిలిచే సమయానికి 5వికెట్ల నష్టానికి 233పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు 46పరుగుల ఆధిక్యత లభించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ ఏడు వికెట్ల నష్టానికి 376పరుగులతో భారత మహిళలజట్టు మరో 30 పరుగులు మాత్రమే జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ 78 పరుగులవద్ద ఔట్‌ కాగా.. పూజా వస్త్రాకర్‌(47) అర్ధసెంచరీకి చేరువలో ఔటయ్యింది. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌటైంది. అలాగే ఆస్ట్రేలియాపై 187పరుగుల ఆధిక్యాన్ని లభించింది. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డినర్‌కు నాలుగు, సదర్లాండ్‌, కిమ్‌ గ్రాత్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆరంభంలో ధాటిగానే ఆడింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (33), మరో ఓపెనర్‌ లిచ్‌ఫీల్డ్‌ (18) బ్యాటింగ్‌లో రాణించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 49పరుగులు జోడించారు. ఈ క్రమంలో మూనీ రనౌట్‌ కావడంతో భారత్‌కు తొలి బ్రేక్‌ లభించింది. ఆ తర్వాత లిచ్‌ఫీల్డ్‌ను స్నేహ్ రాణా బౌల్డ్‌ చేసింది. దీంతో ఆస్ట్రేలియా 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ను ఎలీస్‌ పెర్రీ(45), మెక్‌గ్రాత్‌(73) అర్ధసెంచరీతో ఆదుకున్నారు. ఈ ఇరువురూ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. మూడో సెషన్‌ దాకా ఈ జోడీ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. టీ విరామానికి ముందు పెర్రీని స్నేహ్ రాణా పెవిలియన్‌ చేర్చడంతో మెక్‌గ్రాత్‌.. కెప్టెన్‌ అలిస్సా హీలి(32)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. టీ విరామం తర్వాత ఆసీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ రెండు వికెట్లు భారత సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సాధించింది. 71వ ఓవర్లో ఐదో బంతికి మెక్‌గ్రాత్‌ను బౌల్డ్‌ చేసిన కౌర్‌.. 79వ ఓవర్లో హీలిని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి సదర్లాండ్‌ (12), గార్డ్‌నర్‌(7) క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్‌.. 46 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఉదయం సెషన్‌లో ఆసీస్‌ను ఆలౌట్‌ చేస్తే.. భారత్‌కు గెలుపు చేరువైనట్లే.

స్కోర్‌బోర్డు..ఆస్ట్రేలియా మహిళల తొలి ఇన్నింగ్స్‌: 219

భారత్‌ మహిళల తొలి ఇన్నింగ్స్‌: 406

ఆస్ట్రేలియా మహిళల రెండో ఇన్నింగ్స్‌: మూనీ (రనౌట్‌) రీచా ఘోష్‌ 33, లిట్చ్‌ఫీల్డ్‌ (బి)స్నేహ్ రాణా 18, ఎలీసా పెర్రీ (సి)యాస్టికా భాటియా (బి)స్నేహ్ రాణా 45, తహిల మెక్‌గ్రాత్‌ (బి)హర్మన్‌ప్రీత్‌ 73, ఎలీసా హీలీ (ఎల్‌బి)హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 32, సథర్లాండ్‌ (బ్యాటింగ్‌) 12, గార్డినర్‌ (బ్యాటింగ్‌) 7, అదనం 13. (90ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 233పరుగులు. వికెట్ల పతనం: 1/49, 2/56, 3/140, 4/206, 5/221

బౌలింగ్‌: రేణుకా ఠాకూర్‌ 8-3-22-0, పూజ వస్త్రాకర్‌ 8-0-36-0, స్నేహ్ రాణా 17-3-54-2, దీప్తి శర్మ 19-5-30-0, రాజేశ్వరి గైక్వాడ్‌ 27-10-42-0, జెమిమా రోడ్రిగ్స్‌ 2-0-13-0, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 9-0-23-2.

➡️