IPL 2024: చెన్నైలో టైటిల్‌ పోరు

Mar 25,2024 18:31 #Cricket, #ipl 2024, #Sports
  • మే 26న ఐపీఎల్‌17 ఫైనల్‌
  • పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024 పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 22న చెపాక్‌లో మొదలైన ఐపీఎల్‌ 17 సీజన్‌.. మే 26న చెపాక్‌లోనే టైటిల్‌ పోరుతో ముగియనుంది. సుమారు 12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియం ఐపీఎల్‌ టైటిల్‌ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2011, 2012 ఐపీఎల్‌ ఫైనల్స్‌కు వేదికగా నిలిచిన చెపాక్‌ మళ్లీ తుది పోరుకు ఆతిథ్యం ఇవ్వలేదు. ఫైనల్‌తో పాటు మే 24న రెండో క్వాలిఫయర్‌కు చెన్నై వేదిక కానుంది. తొలి క్వాలిఫయర్‌ మే 21న జరుగనుండగా, ఎలిమినేటర్‌ మే 22న జరుగుతుంది. ఈ రెండు మ్యాచులకు అహ్మదాబాద్‌లోని మొతెరా మైదానం వేదిక కానుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నేపథ్యంలో భద్రతా పరంగా ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా.. నిర్వాహకులు సోమవారం ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదల చేశారు. తొలి దశ షెడ్యూల్‌లో 17 రోజుల్లో 21 మ్యాచులు షెడ్యూల్‌ చేయగా.. తాజా షెడ్యూల్‌లో ప్లే ఆఫ్స్‌ సహా 52 మ్యాచులు చోటుచేసుకున్నాయి.
రెండు గ్రూపులుగా : ఐపీఎల్‌ ఫార్మాట్‌ గత సీజన్‌ మాదిరిగానే ఉంది. లీగ్‌లో పోటీపడుతున్న పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఐదేసి జట్లు చోటుచేసుకున్నాయి. గ్రూప్‌-ఏలో ఐదుసార్లు చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, మాజీ చాంపియన్లు రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ సహా ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ఉన్నాయి. గ్రూప్‌-బిలో ఐదుసార్లు టైటిల్‌ విజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, మాజీ చాంపియన్లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ సహా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఉన్నాయి. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో రెండు మ్యాచుల్లో ఇంటా, బయటా ఫార్మాట్‌లో ఆడుతుంది. ఇతర గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఓ మ్యాచ్‌లో ఢకొీంటుంది. డ్రా ప్రకారం ఇతర గ్రూప్‌లోని మరో జట్టుతో రెండు సార్లు తలపడనుంది. దీంతో ప్రతి జట్టు గ్రూప్‌ దశలో 14 మ్యాచుల్లో తలపడనుంది. గ్రూప్‌ దశ మ్యాచుల అనంతరం టాప్‌-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. టాప్‌-2లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరుకునేందుకు రెండు అవకాశాలు ఉండగా.. 3, 4వ స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌లో చావోరేవో తేల్చుకోవాల్సి ఉంటుంది.
ఆ మూడు స్టేడియాల్లో.. : ఈ సీజన్‌లో ఐపీఎల్‌ ప్రాంఛైజీలు బహుళ హోమ్‌ గ్రౌండ్‌ను ఎంచుకున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు విశాఖపట్నం తొలి రెండు మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. పంజాబ్‌ కింగ్స్‌కు ధర్మశాల, రాజస్థాన్‌ రాయల్స్‌కు గువహటి గ్రౌండ్‌లు హోమ్‌ స్టేడియాలుగా ఉండనున్నాయి. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌ మే 19న గువహటిలో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ నడుమ జరుగనుంది. ధర్మశాల, విశాఖపట్నం, గువహటి రెండేసి మ్యాచులకు వేదికగా నిలువనున్నాయి.
ఉప్పల్‌లో ఏడు మ్యాచులు : ఐపీఎల్‌ 17 సీజన్‌లో హైదరాబాద్‌ మెగా మ్యాచులకు వేదిక కానుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానం ఉప్పల్‌లో ఈ సీజన్‌లో ఏడు మ్యాచులు ఉండనున్నాయి. తొలి మ్యాచ్‌ బుధవారం ముంబయి ఇండియన్స్‌తో ఉండగా.. ఏప్రిల్‌ 5న చెన్నై సూపర్‌కింగ్స్‌, ఏప్రిల్‌ 25న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో సన్‌రైజర్స్‌ ఇక్కడే ఢకొీట్టనుంది. మే 2న రాజస్థాన్‌ రాయల్స్‌, మే 8న లక్నో సూపర్‌జెయింట్స్‌, మే 16న గుజరాత్‌ టైటాన్స్‌, మే 19న పంజాబ్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచులు సైతం ఉప్పల్‌లో జరుగుతాయి.

పూర్తి షెడ్యూల్ ఇలా..

 

➡️