ఇషాన్‌, సూర్య ప్రతాపం

Apr 12,2024 07:55 #Cricket, #ipl 2024, #mumbai indians, #Sports
  • బూమ్రా పాంచ్‌ పఠాకా
  •  ఆర్‌సిబిపై ముంబయి ఘన విజయం

ముంబయి: ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 69 పరుగులు), సూర్య కుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 52 పరుగులు) విజృంభించడంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్‌ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆర్‌సిబి విధించిన 197 పరుగులు లక్ష్యాన్ని ఇంకా 27 బంతులు మిగిలిఉండగానే ముంబయి ఇండియన్స్‌ చేధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి ఓపెనర్లు ఇషాన్‌, రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 38 పరుగులు) మంచి శుభారంభం ఇచ్చారు. తరువాత వచ్చిన సూర్య కుమార్‌ ఆర్‌సిబి బౌలర్లు చుక్కలు చూపించాడు. ఈ తరువాత హర్థిక్‌ పాండ్య (6 బంతుల్లో 21), తిలక్‌ వర్మ (10 బంతుల్లో 16) అజేయంగా నిలిచి ముంబయికి విజయాన్ని అందించారు. అంతకు ముందు ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సిబిపై స్టార్‌ పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (5/21) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 3కు పైగా వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.
ఆర్‌సిబి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు అర్థ సెంచరీలతో కదం తొక్కగా.. మరో ముగ్గురు బ్యాటర్లు సున్నా పరుగులకే నిష్క్రమించారు. గురువారం వాంఖడే స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. దినేశ్‌ కార్తీక్‌ (53 నాటౌట్‌, 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్‌ పాటిదార్‌ (50, 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుప్లెసిస్‌ (61, 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించగా తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఆ ముగ్గురు మెరువగా.. : సొంతగడ్డ వాంఖడేలో టాస్‌ నెగ్గిన ముంబయి ఇండియన్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి (3) సహా విల్‌ జాక్స్‌ (8) పవర్‌ప్లేలోనే డగౌట్‌కు చేరుకున్నారు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (61), రజత్‌ పాటిదార్‌ (50) మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. అర్థ సెంచరీలతో మెరిసిన ఈ ఇద్దరూ బెంగళూర్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా పరుగుల పొదుపుతో పాటు రెండుసార్లు వరుస వికెట్ల ప్రతాపంతో బెంగళూర్‌ను దెబ్బకొట్టాడు. వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడిన బెంగళూర్‌ రన్‌రేట్‌ విషయంలో రాజీపడలేదు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (0), మహిపాల్‌ లామ్రోర్‌ (0), విజరు కుమార్‌ (0)లు డకౌట్‌గా నిష్క్రమించారు. డెత్‌ ఓవర్లలో దినేశ్‌ కార్తీక్‌ (53 నాటౌట్‌) దంచికొట్టాడు. 21 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన దినేశ్‌ కార్తీక్‌ ఇన్నింగ్స్‌ ఆఖరు ఓవర్లో 19 పరుగులు పిండుకున్నాడు. దీంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 196 పరుగులు చేసింది.

➡️