టెస్టుల్లో దుమ్మురేపుతున్న జైస్వాల్‌.. ఆరు ఇన్నింగ్స్‌ 545 పరుగులు

ముంబయి: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ ఇంగ్లండ్‌పై వరుసగా రెండు టెస్టులలో ద్విశతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు. రాజ్‌కోట్‌ వేదికగా ముగిసిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ (214) చేసిన జైస్వాల్‌.. ఈ క్రమంలో 12 భారీ సిక్సర్లు బాది ఓ టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గానూ నిలిచాడు. అలాగే ఐసిసి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ ముందంజలో నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాను అధిగమించి జైస్వాల్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ డబ్ల్యూటిసి 2023-25 సైకిల్‌లో భాగంగా జైస్వాల్‌.. 13ఇన్నింగ్స్‌లలోనే 863 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు మూడు సెంచరీలు (రెండు డబుల్స్‌) చేశాడు. ఈ జాబితాలో నిన్నటిదాకా అగ్రస్థానాన ఉన్న ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా..20ఇన్నింగ్స్‌లలో 855 పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలే.. 15ఇన్నింగ్స్‌లలో 706పరుగులతో మూడో స్థానంలో ఉండగా ఆసీస్‌ వెటరన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. 20ఇన్నింగ్స్‌లలో 687పరుగులతో ఫోర్త్‌ ప్లేస్‌లో ఉన్నాడు. గతేడాది భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్‌.. తొలి టెస్టులోనే భారీ శతకం బాదాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాలో అంతగా రాణించకపోయినా స్వదేశంలో ఇంగ్లండ్‌పై మాత్రం జూలు విదిలించాడు. హైదరాబాద్‌ టెస్టులో సెంచరీ మిస్‌ చేసుకున్న జైస్వాల్‌.. వైజాగ్‌లో టెస్టులో ఏకంగా డబుల్‌ సెంచరీ కొట్టేశాడు. తాజాగా రాజ్‌కోట్‌లో కూడా రెండో ఇన్నింగ్స్‌లో మరో ద్విశతకంతో మెరిశాడు. ఈ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్‌ 6 ఇన్నింగ్స్‌లలో 545 పరుగులు చేసి సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

➡️