దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో భారత పేసర్ మహ్మద్ షమీ నిలిచాడు. నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను ఐసిసి గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసిసి ఎంపిక చేసింది. ఈ జాబితాలో వన్డే ప్రపంచకప్‌లో బౌలింగ్‌లో రాణించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ నిలిచారు. మహ్మద్ షమీ..వన్డే ప్రపంచకప్ టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా షమీ నిలిచాడు. ఈ మెగా టోర్నీలో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 24 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసిసి నామినేట్ చేసింది.ట్రావిస్ హెడ్..ఆస్ట్రేలియాజట్టు ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ ఫైనల్లో సెంచరీతో కదం తొక్కాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో హెడ్ 137 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హెడ్.. 44 సగటుతో 220 పరుగులు చేశాడు.గ్లెన్ మాక్స్వెల్..వన్డే వరల్డ్‌కప్‌తో పాటు టీమిండియాతో జరిగిన టి20 సిరీస్‌లో మాక్స్వెల్ దుమ్మురేపాడు. ప్రపంచకప్ టోర్నీలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర డబుల్ సెంచరీతో మాక్సీ చెలరేగాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను ఒంటి చేత్తో మాక్సీ గెలిపించాడు. అదే విధంగా గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో కూడా మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు.టి20 ప్రపంచకప్ లోగో విడుదల2024 జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనున్న పురుషుల టి20 ప్రపంచకప్ లోగోను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) గురువారం విడుదల చేసింది. లోగోపై క్రికెట్ బ్యాట్, బాల్‌తో పాటు ఈ ఫార్మాట్‌కు సరిపోయే విధంగా ఆ లోగోను ఐసిసి రూపొందించింది. ఈసారి టి20 ప్రపంచకప్ కప్ చేజిక్కించుకొనేందుకు 20జట్లు పోటీపడనున్నాయి. ఆఫ్రికా రీజియన్‌నుంచి చివరి రెండు బెర్తులు పూర్తి కావడంతో మొత్తం 20జట్లు రేసులో నిలిచాయి. ఐసిసి 2007లో టి20 ప్రపంచకప్ టోర్నీలను నిర్వహిస్తోంది. జట్లు: భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, ఉగాండా, అమెరికా.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/player-of-the-month.jpg)