మ్యాచ్‌కు వర్షం అంతరాయం

Dec 13,2023 10:32 #Sports
  • సఫారీల లక్ష్యం 152
  • 15 ఓవర్లకు మ్యాచ్‌ కుదింపు

గ్వెబెర్హా : భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్‌ను కూడా వరుణుడు వదిలిపెట్టడం లేదు.

సెయింట్‌ జార్జ్స్‌ పార్క్‌ వేదికగా జరగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో సఫారీల ముందు 152 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ దిగిన భారత్‌ 19.3 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ తరువాత వర్షం కురియడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. వర్షం వెలిసిన తరువాత అంపెర్లు దక్షిణాఫ్రికా ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

కదం తొక్కిన రికూ సింగ్‌-సూర్యకుమార్‌ యాదవ్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలో భారీ దెబ్బ తగిలింది. ఓపెనర్లు జైస్వాల్‌, శుభ్‌ం గిల్‌ డకౌటయ్యారు. ఈ దశలో తిలక్‌వర్మకు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ జతకలిశాడు. 29 పరుగులు వ్యక్తిగత పరుగుల వద్ద మూడో వికెట్‌గా తిలక్‌వర్మ అవుటయ్యాడు. దీంతో సూర్యకుమార్‌కు రికు సింగ్‌ జతకలిశాడు. ఈ జోడీ ధాటిగా ఆడింది. దీంతో 13 ఓవరుల ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. తరువాత ఓవర్‌లోనే సూర్యకుమార్‌ 56 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్‌గా అవుటయ్యాడు. తరువాత వచ్చిన జితేష్‌ శర్మ (1), రవీంద్ర జడేజా (19), అర్షదీప్‌ సింగ్‌ (0) నిరాశ పర్చారు. ఆట ముగిసే సరికి రికూ సింగ్‌ 68 పరుగులుతో నాటౌట్‌గా ఉన్నాడు.

సూర్యకుమార్‌ ఖాతాలో కొత్త రికార్డు

మంగళవారం రెండో టీ20లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 15 పరుగులు చేయడంతో టీ20ల్లో 2000 పరుగుల పూర్తి చేసుకున్నాడు. అలాగే బంతుల పరంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2 వేల మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కేవలం 1164 బంతుల్లోనే 2000 పరుగుల సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ పేరిట ఉండింది.

ఫించ్‌ 1283 బంతుల్లో 2000 పరుగుల మార్కును దాటాడు. అలాగే సూర్య 56 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును అందుకున్నాడు. భారత్‌ నుంచి అంతర్జాతీయ టీ20ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌ కోహ్లి (107 ఇన్నింగ్స్‌ల్లో 4008 పరుగులు), రోహిత్‌ శర్మ (140 ఇన్నింగ్స్‌ల్లో 3853 పరుగులు), కేఎల్‌ రాహుల్‌ (68 ఇన్నింగ్స్‌ల్లో 2256 పరుగులు) భారత్‌ తరఫున ఇప్పటికే ఫీట్‌ను సాధించారు.

➡️