చరిత్ర సృష్టించిన రోహన్‌ బొపన్న

Jan 28,2024 10:24 #Sports
  • 43ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌

మెల్‌బోర్న్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బొపన్న చరిత్ర సృష్టించాడు. 43ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన ఆటగానిగా రికార్డు నెలకొల్పాడు. సెమీస్‌కు చేరి నెంబర్‌ వన్‌ ర్యాంక్‌తో చరిత్ర లిఖించిన బొపన్న.. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఇటలీ ద్వయంపై విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రోహన్‌ బొప్పన్నామాథ్యూ ఎబ్డెన్‌(ఆస్ట్రేలియా) జోడీ 7-6(7-0), 7-5తో సిమోన్‌ బోలెల్లి-ఆండ్రియా వాస్పోరిలను చిత్తుచేశారు. తొలి పాయింట్‌ నుంచి ఇరువురు హోరాహోరీగా తలపడ్డారు. మొదటి సెట్‌ టైబ్రేక్‌కు దారితీయగా.. ఆ సెట్‌ 7-0 పాయింట్లతో రోహన్‌ జోడీ నెగ్గింది. ఇక రెండో సెట్‌లోనూ ఆటగాళ్లు విజయం కోసం నువ్వా నేనా? అన్నట్లు పోరాడారు. ఒక దశలో రోహన్‌ జోడీ 3-4తో వెనకబడినా అద్భుతంగా పుంజుకొని సెట్‌ను 7-5 తేడాతో నెగ్గి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెలిచిన రోహన్‌ బోపన్న 2017లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి తర్వాత గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన మూడో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న. మహిళల విభాగంలో సానియా మీర్జా ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను నెగ్గింది. దీంతో 43ఏళ్ల 329రోజుల వయసులో ఓ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న పెద్ద వయస్కునిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ టోర్నమెంట్‌లో ఒక్కసారి కూడా మూడోరౌండ్‌ దాటని బప్పన్న.. యుఎస్‌ ఓపెన్‌లో 2010, 2023లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా మాత్రమే నిలిచాడు. ఈ క్రమంలోనే 17వ పర్యాయం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. గతేడాది బోపన్న-ఎబ్డెన్‌ ద్వయం యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరి ఓటమిపాలైంది. 20 ఏళ్ల క్రితం అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బప్పన్న.. ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మూడవ ర్యాంక్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌కు చేరడంతో వచ్చే వారం ప్రకటించే ఏటిపి ర్యాంకింగ్స్‌లో అతను టాప్‌ ర్యాంక్‌లో నిలవనున్నాడు. బప్పన్న భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌ రెండవ ర్యాంక్‌లో నిలిచే ఛాన్సు ఉంది.

➡️