కుర్రాళ్లదీ అదే వ్యథ

Feb 12,2024 11:25 #Cricket
  • టైటిల్‌ పోరులో ఆసీస్‌ చేతిలో ఓటమి
  • 254 పరుగుల ఛేదనలో యువ భారత్‌ చతికిల
  • నాల్గోసారి టైటిల్‌ దక్కించుకున్న ఆస్ట్రేలియా
  • ఐసిసి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌

బెనోని (దక్షిణాఫ్రికా)

యువ భారత్‌ ఆశలు ఆవిరి. ఐసిసి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో నిరాశే ఎదురైంది. 254 పరుగుల ఛేదనలో కుర్రాళ్లు చేతులెత్తేశారు. 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటయ్యారు. 79 పరుగుల తేడాతో యువ ఆస్ట్రేలియా విజయం సాధించింది. అండర్‌19 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఛేదనలో ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (47, 77 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హైదరాబాదీ ఆల్‌రౌండర్‌ మురుగన్‌ అభిషేక్‌ (42, 46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అందరూ విఫలమయ్యారు. ముషీర్‌ ఖాన్‌ (22, 33 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్‌ ఉదరు సహరన్‌ (8), సచిన్‌ దాస్‌ (9), ప్రియాన్షు మోలియ (9) నిరాశపరిచారు. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్‌ సింగ్‌ (55, 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), వీజెన్‌ (48, 66 బంతుల్లో 5 ఫోర్లు), ఒలీవర్‌ (46, 43 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), హ్యారీ డిక్సన్‌ (42, 56 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

ఛేదనలో చతికిల : యువ భారత్‌ లక్ష్యం 254 పరుగులు. బ్యాటింగ్‌ లైనప్‌లో అందరూ మంచి ఫామ్‌లో ఉండటంతో కుర్రాళ్లు అంచనాలను అందుకుంటారనే అనుకున్నారు. కానీ కుర్ర కంగారూలు ఖతర్నాక్‌ గేమ్‌తో పైచేయి సాధించారు. ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (47) రాణించినా.. అర్శిన్‌ కులకర్ణి (3), ఉదరు సహరన్‌ (8), సచిన్‌ దాస్‌ (9), అరవెళ్లి అవినాశ్‌ (0), రాజ్‌ లింబాని (0) తేలిపోయారు. ముషీర్‌ ఖాన్‌ (22), ఆదర్శ్‌ క్రీజులో ఉండగా ఛేదనపై ఆశలు సజీవంగా నిలిచాయి. కానీ ముషీర్‌ నిష్క్రమణతో బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కుప్పకూలింది. 91 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుని ఓటమి కోరల్లోకి కూరుకుంది. హైదరాబాదీ ఆల్‌రౌండర్‌ మురుగన్‌ అభిషేక్‌ (42) ఆసీస్‌ వేగాన్ని అడ్డుకట్ట వేశాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిసిన అభిషేక్‌ ఒత్తిడిలో ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. కానీ అతడికి సహచరుల నుంచి ఎటువంటి మద్దతు దక్కలేదు. మురుగన్‌ అభిషేక్‌ వికెట్‌తో ఆసీస్‌ కుర్రాళ్లు విజయాన్ని అందుకున్నారు. యువ ఆసీస్‌ బౌలర్లలో మహ్లి బీయర్డ్‌మ్యాన్‌, మెక్‌మిలాన్‌ మూడేసి వికెట్లు పడగొట్టారు. బియర్డ్‌మ్యాన్‌ భారత టాప్‌-3 వికెట్లతో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బౌలర్లు మెరిసినా..! : టైటిల్‌ పోరులో టాస్‌ నెగ్గిన ఆసీస్‌ కుర్రాళ్లు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. ఒత్తిడితో కూడిన ఫైనల్లో భారత బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశారు. ఆ జట్టులో ఏ బ్యాటర్‌ భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. అయినా, సమిష్టి ప్రదర్శనతో ఆసీస్‌ మంచి స్కోరు నమోదు చేసింది. ఓపెనర్‌ శామ్‌ (0) నిరాశపరిచినా.. హ్యారీ డిక్సన్‌ (42), కెప్టెన్‌ హ్యు వీజెన్‌ (48) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు ఈ జోడి 78 పరుగులు జోడించింది. హర్జాస్‌ సింగ్‌ (55) అర్థ సెంచరీతో మెరిశాడు. రియాన్‌ హిక్స్‌ (20)తో కలిసి హర్జాస్‌ సైతం 66 పరుగులు జోడించాడు. దీంతో ఆసీస్‌ మంచి స్కోరు ఖాయం చేసుకుంది. లోయర్‌ ఆర్డర్‌లో ఒలీవర్‌ పీకె (46) రాణించటంతో విలువైన భాగస్వామ్యాలు సాధ్యమయ్యాయి. అండర్సన్‌ (13), టామ్‌ స్ట్రాకర్‌ (8) ఆకట్టుకున్నారు. దీంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాజ్‌ లింబాని (3/38) మూడు వికెట్లు పడగొట్టగా.. నమన్‌ తివారీ (2/63) రెండు వికెట్లు తీసుకున్నాడు. హైదరాబాదీ స్పిన్నర్‌ మురుగన్‌ అభిషేక్‌ (0/37) పరుగుల పొదుపు పాటించినా వికెట్‌ తీయలేదు. సామీ పాండే, ముషీర్‌ ఖాన్‌లు తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

సంక్షిప్ల స్కోరు వివరాలు : ఆస్ట్రేలియా19 : 253/7 (హర్జాస్‌ 55, వీజెన్‌ 48, ఒలీవర్‌ 46, రాజ్‌ 3/38, నమన్‌ తివారీ 2/63) భారత్‌ 19 : 174/10 (ఆదర్శ్‌ సింగ్‌ 47, మురుగన్‌ అభిషేక్‌ 42, బియర్డ్‌మ్యాన్‌ 3/15, మెక్‌మిలాన్‌ 3/43)

➡️