ఫైనల్లో సాత్విక్‌ జోడీ

Jan 14,2024 08:46 #Sports

సెమీస్‌లో కొరియా షట్లర్లపై గెలుపు

మలేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌, చిరాగ్‌ విధ్వంసం కొనసాగుతోంది. మలేషియా ఓపెన్‌లో వరల్డ్‌ నం.5 దక్షిణ కొరియా జోడీ ఓ గేమ్‌లో 20ా14తో ముందంజ నిలువగా.. ఇక గేమ్‌పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. కానీ ఎటువంటి అవకాశాలు కనిపించని స్థితిలో, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని వరుసగా ఆరు గేమ్‌ పాయింట్లను కాచుకుని నిలువటం అసాధారణం. ఆ పనే సాత్విక్‌, చిరాగ్‌ జోడీ చేసి చూపించింది. 20-14తో దీమాగా ఉన్న ప్రత్యర్థులను చిత్తు చేసి 22-20తో గేమ్‌ను గెల్చుకున్నారు. మలేషియా ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

కౌలాలంపూర్‌ : భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్స్‌ మరో సూపర్‌ సిరీస్‌ విజయం దిశగా సాగుతున్నారు. సహచర భారత స్టార్‌ క్రీడాకారులు తంటాలు పడుతుండగా, గత ఏడాది ఏకంగా ఆరు టైటిళ్లు సాధించిన సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ.. ఈ ఏడాది ఆరంభంలోనే ఏకంగా సూపర్‌ సిరీస్‌పై కన్నేశారు. మలేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ 1000లో ఫైనల్లోకి చేరుకున్నారు. శనివారం జరిగిన సెమీఫైనల్‌ పోరులో దక్షిణ కొరియా షట్లర్లు, ఆరో సీడ్‌ కాంగ్‌ మిన్‌, సియో జోలపై సాత్విక్‌, చిరాగ్‌ జోడీ వరుస గేముల్లో గెలుపొందారు. 21-18, 22-20తో సత్తా చాటి పురుషుల డబుల్స్‌ టైటిల్‌ పోరుకు చేరుకున్నారు. వరల్డ్‌ నం.5 దక్షిణ కొరియా షట్లర్లపై సాత్విక్‌, చిరాగ్‌లకు ఇది నాల్గో విజయం కావటం విశేషం.

ఇంకొక్క అడుగే : పారిస్‌ ఒలింపిక్స్‌ ఏడాదిలో సాత్విక్‌, చిరాగ్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఏడాది ఆరంభంలోనే మలేషియా ఓపెన్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. సూపర్‌ సిరీస్‌ 1000 టోర్నీ ఫైనల్స్‌కు చేరుకుని.. ఆసియా చాంపియన్‌షిప్స్‌తో పాటు ఒలింపిక్స్‌ పసిడి రేసులో ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. ఇక మలేషియా ఓపెన్‌ మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో మనోళ్లకు తిరుగులేదు. వరుస మ్యాచుల్లో అలవోక విజయాలు నమోదు చేశారు. సెమీఫైనల్లోనూ అదే పునరావృతం అయ్యింది. దక్షిణ కొరియా షట్లర్లు సైతం మంచి ఫామ్‌లో ఉండటంతో ఉత్కంఠ తప్పదు అనిపించింది. కానీ సాత్విక్‌, చిరాగ్‌లు వరుస గేముల్లోనే లాంఛనం ముగించారు. 47 నిమిషాల్లోనే టైటిల్‌ పోరు బెర్త్‌ సొంతం చేసుకున్నారు. తొలి గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ ఆధిపత్యం నడిచింది. ఈ గేమ్‌లో ఆరో సీడ్‌ జోడీ నుంచి ప్రతిఘటన కనిపించలేదు. 5ా0తో దూకుడుగా మొదలెట్టిన సాత్విక్‌, చిరాగ్‌లు విరామ సమయానికి 11-8తో ఆధిక్యం నిలుపుకున్నారు. ద్వితీయార్థంలో 13-12, 14-13తో ప్రత్యర్థులు అంతరం కుదించినా..ఆ తర్వాత దూసుకెళ్లారు. వరుస పాయింట్లతో మెప్పించారు. 21-18తో ఉత్కంఠకు తావులేకుండా తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నారు. రెండో గేమ్‌లో వరల్డ్‌ నం.2 సాత్విక్‌, చిరాగ్‌లు వెనుకంజ వేశారు. 3-3 తర్వాత దక్షిణ కొరియా షట్లర్లు ముందంజ వేశారు. 11-8తో విరామ సమయానికి ఆధిక్యం సాధించారు. ద్వితీయార్థంలోనూ ప్రత్యర్థులను వరుస పాయింట్లు గెల్చుకున్నారు. 14-20తో రెండో గేమ్‌ను కోల్పోయే స్థితిలో నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌లు ఆఖర్లో అద్భుతమే చేశారు. ప్రత్యర్థిని గేమ్‌ పాయింట్‌ వద్ద నిలిపి.. వరుసగా ఎనిమిది పాయింట్లు సొంతం చేసుకున్నారు. 20ా20తో స్కోరు సమం చేయటంతో పాటు 22-20తో రెండో గేమ్‌ను, ఫైనల్స్‌ బెర్త్‌ను దక్కించుకున్నారు. వరుసగా ఆరు గేమ్‌ పాయింట్లను కాచుకుని, ఒత్తిడిలో సత్తా చాటిన సాత్విక్‌, చిరాగ్‌లు ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనకు ట్రైలర్‌ చూపించారు. మ్యాచ్‌ మూడో గేమ్‌కు వెళ్తుందనే ఆశలతో కనిపించిన దక్షిణ కొరియా షట్లర్లు.. సాత్విక్‌, చిరాగ్‌ దూకుడుకు దాసోహం అయ్యారు. నేడు జరిగే టైటిల్‌ పోరులో మెన్స్‌ డబుల్స్‌ కిరీటం కోసం సాత్విక్‌, చిరాగ్‌లు ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్నారు.

➡️