Team India కెప్టెన్‌గా శుభ్‌మన్‌

Jun 25,2024 06:54 #Cricket, #Sports, #submangill, #Team India
  • జింబాబ్వే పర్యటనకు జట్టును ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: టి20 ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం భారతజట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు టి20 ప్రపంచకప్‌లో ఆడిన సీనియర్లను భారత క్రికెట్‌ బోర్డు(బిసిసిఐ) పక్కన పెట్టి.. యువ క్రికెటర్లకు పెద్దపీట వేసింది. ఈ పర్యటనకు టి20 ప్రపంచకప్‌లో ఆడిన అందరు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ప్రధాన కోచ్‌ ఎవరో ఇంకా తేలకున్నా.. కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ను అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలో సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈ పర్యటనకు జాతీయ క్రికెట్‌ అకాడమీ చైర్మన్‌గా ఉన్న వివిఎస్‌ లక్ష్మణ్‌ జింబాబ్వే సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించే ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను ఖరారు చేసిన బిసిసిఐ సోమవారం షెడ్యూల్‌ను వెల్లడించింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. వికెట్‌ కీపర్లుగా సంజూ శాంసన్‌, ధ్రువ్‌ జురెల్‌లు చోటు దక్కించుకున్నారు. ఇక ఐపిఎల్‌ సీజన్‌-17లో అద్భుతంగా రాణించిన అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, తుషార్‌ దేశ్‌పాండేలు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నారు. అలాగే పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా జూలై 6వ తేదీన జరిగే తొలి మ్యాచ్‌తో టి20 సిరీస్‌ రంభం కానుంది.
జట్టు: శుభ్‌మన్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ, రింకూ సింగ్‌, సంజూ శాంసన్‌, ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌రెడ్డి, రియాన్‌ పరాగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బిష్ణోరు, అవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, తుషార్‌ దేశ్‌పాండే.
షెడ్యూల్‌ : జులై 6 : తొలి టి20, జులై 7 : రెండో టి20, జులై 10 : మూడో టి20, జులై 13 : నాల్గో టి20, జులై 14 : ఐదో టి20

➡️