ఐపిఎల్‌ 2024 షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్‌.. ఆందోళనలో బిసిసిఐ !

Jan 22,2024 13:49 #IPL, #match, #Mumbai

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) 2024 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఐపిఎల్‌ 17వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ దాదాపు ఖరారైంది. 2024 మార్చి 22న ఐపిఎల్‌ ప్రారంభించేందుకు బిసిసిఐ ముహూర్తం ఫిక్స్‌ చేసింది. ఇక మే 26 న ఫైనల్‌ జరిగేలా షెడ్యూల్‌ రూపొందించిందని సమాచారం. 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్‌పై బిసిసిఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో.. ఎలక్షన్‌ డేట్స్‌ వచ్చాకే ఐపిఎల్‌ 2024 షెడ్యూల్‌ను వెల్లడించాలని బిసిసిఐ భావిస్తోంది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపిఎల్‌ 2024ని విదేశాల్లో నిర్వహిస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే బిసిసిఐ మాత్రం భారత్‌లోనే టోర్నీ జరిగేలా చూస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఆ మ్యాచ్‌లను మరో చోటికి మార్చే ఆలోచనలో బిసిసిఐ ఉందట. ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలో బిసిసిఐ ఆందోళన చెందుతోంది. 2024 టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 1న మొదలుకానుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న జరగనుంది. విశ్రాంతి తీసుకోవడానికి ఈ సమయం భారత ఆటగాళ్లకు సరిపోతుంది. అయితే జూన్‌ 2, 3, 4 తేదీలలో కొన్ని టాప్‌ జట్లకు మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బోర్డులు భావిస్తే.. ఫైనల్‌కు విదేశీ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపిఎల్‌) ను ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డబ్యూపీఎల్‌ 2024 మ్యాచ్‌లన్నీ బెంగళూరు, ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో 2-3 రోజుల్లో విడుదల కానుంది. మొదటి సీజన్‌ ముంబైకి మాత్రమే పరిమితమవ్వగా.. ఈ సీజన్‌కు రెండు వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. మొదటి భాగం మ్యాచ్‌లు బెంగళూరులో.. రెండోవ భాగం మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నట్టు తెలుస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రం ఢిల్లీలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

➡️