నేడు భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టీ20

Dec 10,2023 14:56 #Sports
  • ఇరు జట్ల నుంచి బరిలో యువ ఆటగాళ్లు
  • రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ఇటు భారత్‌, అటు దక్షిణాఫ్రికా.. 2024 టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఆడనున్న సన్నాహక మ్యాచులు ఆరు టీ20లు. భారతో సిరీస్‌ అనంతరం సఫారీ ఏకంగా ప్రపంచకప్‌ జట్టును ప్రకటించనుంది. భారత్‌కు అఫ్గనిస్థాన్‌తో సిరీస్‌ సైతం ఉంది. రెండు జట్లు ఐపీఎల్‌, ఎస్‌ఏ20 లీగ్‌ల్లో ప్రదర్శనను సైతం పరిగణనలోకి తీసుకుంటాయి. ఇరు జట్లలో సీనియర్లు దూరమైన వేళ కుర్ర క్రికెటర్లు ప్రపంచకప్‌ జట్టులో బెర్త్‌పై కన్నేసి బరిలోకి దిగుతున్నారు. భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టీ20 పోరు రేపు.

సెలక్షన్‌ డైలామా!

డర్బన్: టీమ్‌ ఇండియా తుది జట్టు కూర్పుపై కుస్తీ పడుతోంది. శుభ్‌మన్‌ గిల్‌ రాకతో ఓపెనింగ్‌ జోడీ ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఆసీస్‌తో సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ రాణించారు. రుతురాజ్‌ ఓ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. యశస్వి పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌ ప్రభావం చూపించాడు. గిల్‌ ఓపెనర్‌గా వస్తే ఈ ఇద్దరిలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. శ్రేయస్‌ అయ్యర్‌ వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో దూకుడు చూపిస్తున్నాడు. వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. అయినా, యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మకు ఈ ఫార్మాట్‌లో అవకాశం ఇవ్వాలనే వాదన బలంగా వినిపిస్తోంది. బ్యాటింగ్‌ లైనప్‌లో కుడిాఎడమ కాంబినేషన్‌కు సైతం తిలక్‌ వర్మ ఉపయుక్తం. సూర్య కుమార్‌, రింకూ సింగ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. యువ వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ కంగారూలపై ఖతర్నాక్‌ ప్రదర్శన చేశాడు. క్రీజులోకి వచ్చీ రాగానే దంచికొడ్తున్నాడు. జితేశ్‌కు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ సముఖంగా కనిపిస్తోంది. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా వరల్డ్‌ నం.1 రవి బిష్ణోరుతో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ పోటీపడుతున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లో బిష్ణోరు అత్యధిక వికెట్లు కూల్చాడు. సఫారీలపైనా ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు కుల్దీప్‌ యాదవ్‌ సైతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు తుది జట్టులో నిలుస్తారో చూడాలి. మహ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌లు ఆల్‌రౌండర్లుగా జట్టులో నిలువనున్నారు!.

భలే మంచి ఛాన్స్‌! : టీ20 ప్రపంచకప్‌ ముంగిట వెస్టిండీస్‌తో సఫారీలు మరో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఆ సిరీస్‌లో ప్రపంచ కప్‌ జట్టే తలపడనుంది. దీంతో వరల్డ్‌కప్‌ రేసులో నిలిచేందుకు, సత్తా చాటేందుకు సఫారీ క్రికెటర్లకు ఇదే చివరి అవకాశం. దీంతో భారత్‌తో సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగేందుకు సిద్ధమవుతున్నారు. రీజా హెండ్రిక్స్‌, స్టబ్స్‌, ఫెరీరా, మార్కో జాన్సెన్‌ సహా జెరాల్డ్‌, బర్గర్‌లు వరల్డ్‌కప్‌ బెర్త్‌పై కన్నేశారు. స్వదేశంలో అనుకూల పరిస్థితుల్లో మెరిస్తే.. ప్రపంచకప్‌ జట్టు రేసులో నిలిచేందుకు అవకాశం ఎక్కువ. కెప్టెన్‌ ఎడెన్‌ మార్క్‌రామ్‌, డెవిడ్‌ మిల్లర్‌ సైతం తమదైన జోరు చూపించాలని ఎదురు చూస్తున్నారు. గత సీజన్‌ ఎస్‌ఏ20లో మార్క్‌రామ్‌ పరుగుల మోత మోగించాడు. కొన్నాండ్లుగా ఈ ఫార్మాట్‌లో మిల్లర్‌ అద్భుతాలు చేస్తున్నాడు. ఈ జోడీ బ్యాట్‌తో అంచనాలు అందుకుంటే.. సఫారీలకు బ్యాటింగ్‌ లైనప్‌లో కష్టాలు ఉండవు. షంషి, కేశవ్‌ మహరాజ్‌లు భారత్‌పై మాయ చేసేందుకు చూస్తుండగా.. జాన్సెన్‌, జెరాల్డ్‌లు పేస్‌ సత్తా చాటనున్నారు. పిచ్‌,

వాతావరణం : డర్బన్‌లో నేడు ఉదయం వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు చిరుజల్లులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌ సమయంలో వర్షం సూచనలు లేకపోయినా వాతావరణం మేఘావృతమై ఉండనుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లు వికెట్ల వేటలో ప్రభావం చూపనున్నారు. ఇక్కడ గతంలో ఆసీస్‌తో మ్యాచుల్లో తొలి ఇన్నింగ్స్‌ల్లో 190 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. నేడు భారత్‌, సఫారీ టీ20లోనూ భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇక్కడ టాస్‌ ప్రభావం పెద్దగా ఉండదు.

తుది జట్లు (అంచనా) : భారత్‌ : యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌/రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌/రవి బిష్ణోరు, మహ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌/ముకేశ్‌ కుమార్‌.

దక్షిణాఫ్రికా : హెండ్రిక్స్‌, మాథ్యూ, మార్క్‌రామ్‌ (కెప్టెన్‌), క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌), డెవిడ్‌ మిల్లర్‌, ఫెరీరా, మార్కో జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, జెరాల్డ్‌ , బర్గర్‌ , షంషి.

➡️