ఉత్తమ జట్టునే ఎంపిక చేశాం

May 2,2024 22:17 #BCCI, #Sports, #T20 world cup, #Team India
  •  మీడియా సమావేశంలో చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌

ముంబయి: టి20 ప్రపంచకప్‌ మెగా టోర్నీ జట్టు ఎంపికపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తున్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో టాప్‌ ఆర్డర్‌ బలంగానే ఉందని, మిడిల్‌ ఆర్డర్‌ను బలీయం చేయాలనే దృష్టితో శివమ్‌ దూబేను ఎంపిక చేశామని అగార్కర్‌ తెలిపాడు. ఐపిఎల్‌లో దూబే మెరుగైన ప్రదర్శనను కనబరుస్తున్న దృష్ట్యా అతడిని ఎంపిక చేశామన్నారు. హార్దిక్‌పాండ్య ఫిట్‌గా, అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలని భావిస్తున్నామని, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు. రింకు సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై మాట్లాడుతూ.. అందులో అతడి తప్పేం లేదు. అయినా అతడు ట్రావెలింగ్‌ సబ్స్‌లో ఉన్నాడు. ఇది కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ, జట్టును సమతుల్యంగా ఉంచే క్రమంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవు. మేం ఒక అదనపు స్పిన్నర్‌ ఉండాలనుకున్నాం. అందుకే అతడ్ని రిజర్వులో ఉంచాం అని చెప్పుకొచ్చాడు. జట్టులో నలుగురు ఆల్‌రౌండర్లపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ”నలుగురిని ఎందుకు ఎంపిక చేశామనేది ఇప్పుడు కాదు.. వెస్టిండీస్‌లో వెల్లడిస్తా అన్నాడు. వెస్టిండీస్‌ పిచ్‌లపై ఇద్దరు స్పిన్నర్లు ఎంపికను రోహిత్‌ సమర్థించుకొన్నాడు. హార్దిక్‌ సీమ్‌ ఆల్‌రౌండర్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్షర్‌, జడేజా బ్యాట్‌తోనూ రాణిస్తారు. కుల్దీప్‌, చాహల్‌ స్పిన్నర్లుగా జట్టును బ్యాలెన్స్‌ చేస్తారని తెలిపాడు.

➡️