కాసుల వర్షం

Dec 9,2023 22:10 #Sports

-కాశ్వీ, అనాబెల్‌కు రూ. 2 కోట్లు ,వృందాకు రూ. 1.3 కోట్లు

-డబ్ల్యూపీఎల్‌ ప్లేయర్స్‌ వేలం

ముంబయి : మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలంలో భారత యువ క్రికెటర్ల కాసుల పంట పండింది. డబ్ల్యూపీఎల్‌ తొలి వేలంలో నిరాశ ఎదురైనా.. ఏడాది కాలంగా కఠోర సాధన చేసిన కాశ్వీ గౌతమ్‌, వృందా దినేశ్‌లు కండ్లు చెదిరే బిడ్లు దక్కించుకున్నారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ కాశ్వీ గౌతమ్‌ రూ. 2 కోట్లకు గుజరాత్‌ జెయింట్స్‌ సొంతమవగా, డ్యాషింగ్‌ బ్యాటర్‌ వృందా దినేశ్‌ రూ. 1.3 కోట్లకు యూపీ వారియర్స్‌ శిబిరంలో చేరింది. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లుగా వేలంలోకి వచ్చిన ఈ ఇద్దరు అత్యధిక ధరతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ అనాబెల్‌ సుదర్‌లాండ్‌ సైతం రూ.2 కోట్లు దక్కించుకుంది. అత్యధిక మొత్తం సొంతం చేసుకున్న విదేశీ ప్లేయర్‌గా నిలిచింది. డబ్ల్యూపీల్‌ మినీ వేలం శనివారం ముంబయిలో జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ సొమ్మంతా సుదర్‌లాండ్‌పై పెట్టేసింది. ఆమె కోసం రూ. 2 కోట్లు వెచ్చించిన క్యాపిటల్స్‌ అందుబాటులో ఉన్న పర్సులో ఏకంగా 88 శాతం ఖర్చు చేసింది. శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. ఎవరూ ఆసక్తి చూపలేదు. విండీస్‌ మాజీ కెప్టెన్‌ డాటిన్‌, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కిమ్‌ గార్త్‌లకు సైతం వేలంలో నిరాశే ఎదురైంది. భారత క్రికెటర్లు ఏక్తా బిస్త్‌ రూ. 60 లక్షలు, వేద కృష్ణమూర్తి, సబ్బినేని మేఘన రూ. 30 లక్షలు దక్కించుకున్నారు. తొలి సీజన్‌లో రూ. 1.6 కోట్ల దక్కించుకున్న దేవిక వైద్య.. ఈ సారి బిడ్లను ఆకర్షించలేదు. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (దక్షిణాఫ్రికా) కోసం ముంబయి ఇండియన్స్‌ రూ. 1.2 కోట్లు వెచ్చించగా.. ఆసీస్‌ బ్యాటర్‌ లిచ్‌ఫీల్డ్‌ను రూ. 1 కోటితో గుజరాత్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. ఇక తెలుగమ్మాయి త్రిష పూజిత రూ. 10 లక్షల కనీస ధరకు గుజరాత్‌ జెయింట్స్‌ గూటికి చేరుకుంది. ఇక మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ 2024 ఫిబ్రవరిలో జరుగనుంది. ముంబయి, బెంగళూర్‌లలోని ఏదేని నగరం సీజన్‌ మొత్తానికి ఆతిథ్యం ఇవ్వనుంది.

➡️