‘కవచ్‌’ ఉంటే ప్రమాదం తప్పేనా..?

Jun 18,2024 04:19 #Kavach, #software, #train

న్యూఢిల్లీ : ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థే ‘కవచ్‌’. ఈ సాంకేతికత అందుబాటులో ఉండి ఉంటే.. పశ్చిమబెంగాల్‌లో సోమవారం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తప్పేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైల్వేకు రక్షణ కవచం లాంటి ఈ వ్యవస్థ ఈ మార్గంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. తాజా దుర్ఘటన నేపథ్యంలో ‘కవచ్‌’ మరోసారి చర్చకు వచ్చింది. గతంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‘కవచ్‌’ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

ఏంటీ కవచ్‌ వ్యవస్థ..
రైళ్ల రాకపోకలకు నియంత్రించేందుకు భారత రైల్వే గత కొన్నేళ్లుగా విదేశీ సాంకేతికతపైనే ఆధారపడాల్సి వస్తోంది. దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేసే క్రమంలోనే రీసర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌ఎస్‌డిఓ).. మేధా సర్వో డ్రైవ్స్‌, కెర్నెక్స్‌ మైక్రో సిస్టమ్స్‌తో కలిసి ‘ట్రైన్‌ కొలిజన్‌ అవైడెన్స్‌ సిస్టమ్‌ (టిసిఎఎస్‌)’ అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనిని భారతీయ రైల్వే ఆమోదించింది. దీన్నే ఆటోమెటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ (ఎటిపి) సిస్టమ్‌, కవచ్‌ (కవచ్‌) గా పిలుస్తున్నారు. రైల్వేల్లో ‘సున్నా ప్రమాదాలే’ లక్ష్యంగా ఈ కవచ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం ఎదురైనప్పుడు రైలు దానంతట అదే ఆగిపోయేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఉదాహరణకు ఒక రైలు వెళ్తోన్న మార్గంలోనే కొంత దూరంలో మరో రైలు కూడా ప్రయాణిస్తున్నప్పుడు.. ఈ ‘కవచ్‌’ టెక్నాలజీ వెంటనే సెన్సర్లతో గుర్తిస్తుంది. దీంతో రైలు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. రెడ్‌ సిగల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్‌ అలాగే రైలును తీసుకెళుతుంటే.. ఈ వ్యవస్థతో ఆటోమెటిక్‌గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రైలును ఆపేస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే.. కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది. సోమవారం జరిగిన రైలు ప్రమాదం ఘటనలో సిగలింగ్‌ వైఫల్యం కన్పించింది. ప్రమాదం జరిగిన రాణిపత్ర రైల్వే స్టేషన్‌, చట్టర్‌ హట్‌ జంక్షన్‌ మధ్య ఆటోమెటిక్‌ సిగలింగ్‌ సిస్టమ్‌ సోమవారం ఉదయం 5.50 గంటల నుంచి పనిచేయలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో ‘కవచ్‌’ వ్యవస్థ ఉండి ఉంటే.. సిగల్‌ దాటుకుని వచ్చినా గూడ్స్‌ రైలు ఆగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కవచ్‌ వ్యవస్థ రైల్వే నెట్‌వర్క్‌లోని చాలా ప్రాంతాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది చివరి నాటికి 3వేల కిలోమీటర్ల ట్రాక్‌లకు కవచ్‌ను తీసుకురావాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఢిల్లీ-హావ్‌డా మార్గం కూడా ఉంది. దీని పరిధిలోనే తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా వుంది.

➡️