‘విద్యా కానుక’ బూట్ల విక్రయాలపై విచారణ…..ప్రజాశక్తికి స్పందన

Jun 25,2024 21:43

ఎంజిఎం పాఠశాలలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి

              హిందూపురం : హిందూపురం పట్టణంలో ‘విద్యాకానుక’ బూట్ల విక్రయాల ఘటనపై అధికారులు స్పందించారు. ‘విద్యాకానుక ‘ బూట్ల విక్రయాల శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి, మధ్యాహ్న భోజన పథకం ఏడి రామకృష్ణ, సిఎంఒ అబ్దుల్‌ మాలిక్‌ మంగళవారం స్థానిక ఎంజిఎం పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొన్ని రికార్డులను పరిశీలించారు. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి విద్యార్థుల కోసం ఎన్ని బూట్లు వచ్చాయి, అందులో ఎన్నివిద్యార్థులకు అందించారు, మిగిలిన బూట్ల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయిన బూట్లలో పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందించలేదని రికార్డుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారిణి మీనాక్షి మాట్లాడుతూ ప్రజాశక్తి లో వచ్చిన కథనంపై సమగ్ర విచారణ చేపడుతున్నమన్నారు. రికార్డుల పరిశీలనలో విద్యా కానుక ద్వారా అందించిన బూట్లు పాఠశాల నుంచి విక్రయించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు. దీనిపై పాఠశాల హెచ్‌ఎమ్‌కు మెమో ఇచ్చామన్నారు. ఇచ్చిన మెమోకు హెచ్‌ఎం సకాలంలో సరైన సమాధానం ఇవ్వకుంటే సస్పెండ్‌ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి అందించిన విద్యా సామాగ్రితో బూట్లు, సాక్స్‌ ఇతర విద్యాసామాగ్రి విక్రయిస్తేఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. వారిపై కఠిన చర్యలు చేపడుతామన్నారు. పాఠశాలల్లో అవసరంలేని వస్తువులు ఏవైనా ఉంటే విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ, పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతో ఒక కమిటీ వేసి వారి నిర్ణయం మేరకు వాటిని విక్రయించి, దాని నుంచి వచ్చిన నగదును పాఠశాల ఖాతాలోకి జమ చేయాలన్నారు. నిబంధనలు పాటించకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇష్టానుసారంగా నిర్ణయాలను తీసుకొని వ్యవహరిస్తే విద్యాశాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు గంగప్ప, ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️