VisakhaPort: సముద్ర ఉత్పత్తుల రవాణాలో అగ్రగామిగా విశాఖ పోర్టు

Jun 24,2024 22:14 #Exports, #Sea Port, #Visakha Port

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : సముద్ర ఉత్పత్తుల రవాణాలో భారతదేశంలోనే విశాఖపట్నం పోర్టు అగ్రగామిగా నిలిచింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.17,983.99 కోట్ల విలువేన 3,14,199 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి దేశంలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తరువాత రూ.6,395.70 కోట్ల విలువైన 2,40,253 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు అథారిటీ రెండో స్థానంలో నిలిచింది. రూ.6,120 కోట్ల విలువైన 1,81,400 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి కొచ్చిన్‌ పోర్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రూ.60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రధాన ఎగుమతి గమ్యస్థానాల్లో, విదేశీ డిమాండ్‌లో సవాళ్లు ఎదురైనా భారత్‌ వాటిని అధిగమించి నూతన రికార్డులను నెలకొల్పింది. 132 దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసి తన ప్రతిష్టను పెంచుకుంది. ఎగుమతులలో రొయ్యలు ప్రధాన పాత్ర పోషించాయి.

నెంబర్‌ 1గా విశాఖ పోర్టు నిలవడం వెనుక కారణాలివీ..
ఆంధ్రప్రదేశ్‌లో దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వాకల్చర్‌ పరిశ్రమ విశాఖ పోర్టు మొదటి స్థానంలో నిలవడంలో దోహదపడింది. వనామి రకం రొయ్యల అధిక ఉత్పత్తి, ఒడిశా సముద్ర ఉత్పత్తులను విశాఖ పోర్టు నుంచి ఎగుమతి చేయడం వంటి అంశాలు విశాఖ పోర్టును ప్రగతిపథాన నిలిపాయి.

➡️