అక్రమం, రాజకీయ దురుద్దేశపూరితం

Feb 22,2024 10:25 #London High Court
  •  అసాంజె అప్పగింత ప్రయత్నాలపై లండన్‌ హైకోర్టులో లీగల్‌ టీమ్‌ వాదనలు

లండన్‌ : వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్‌ జూలియన్‌ అసాంజెను అమెరికాకు అప్పగించడానికి జరుగుతున్న యత్నాలు అక్రమమని, రాజకీయ దురుద్దేశంతో కూడినవని లండన్‌ హైకోర్టులో విచారణ సందర్భంగా అసాంజె తరపు లీగల్‌ టీమ్‌ వ్యాఖ్యానించింది. ఈ కేసులో తుది విచారణ మంగళవారం ఆరంభమైంది. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో అసాంజె కోర్టుకు హాజరు కాలేకపోయారు. కనీసం వీడియో లింక్‌ ద్వారా కూడా పాల్గొనలేకపోయారు. ఆయన ఆరోగ్యంపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసాంజెను అమెరికాకు అప్పగించడానికి అధికారికంగా ఆమోదించిన బ్రిటన్‌ మాజీ హోం మంత్రి ప్రీతి పటేల్‌ అమెరికాలో ఆయనకు మరణశిక్ష విధించబోరని హామీ ఇవ్వడంలో విఫలమయ్యారని అసాంజె తరపున న్యాయస్థానంలో లీగల్‌ టీమ్‌ లీడర్‌ ఎడ్వర్డ్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌ వాదించారు. బ్రిటన్‌, అమెరికా మధ్య వున్న ఖైదీల అప్పగింత ఒప్పందం నిబంధనల మేరకు రాజకీయ కారణాలతో అప్పగింత అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శతాబ్దాల తరబడి అమల్లో వున్న చట్టపరమైన రక్షణలపైనే ఈ అప్పగింత ఆధారపడి వుందన్నారు. తనను అప్పగించవద్దంటూ అసాంజె పెట్టుకున్న పిటిషన్‌పై లండన్‌లోని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌లో రెండు రోజుల విచారణ మంగళవారం ఆరంభమైంది. ఈ పిటిషన్‌పై విచారణలో ఆయనకు అనుకూలంగా తీర్పు రాకపోతే అమెరికాలో గూఢచర్యం చట్టం కింద అసాంజె 17 అభియోగాలను, కంప్యూటర్‌ హ్యాకింగ్‌ అభియోగాన్ని ఎదుర్కొనాల్సి వుంటుంది. 175ఏళ్ళ పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా వున్నాయి. ఈ వారంలో విచారణ పూర్తయితే ఈ ఏడాది చివరిలో పూర్తి స్థాయి అప్పీల్‌పై విచారణ జరుగుతుంది.

➡️