స్విస్‌ సదస్సు తీర్మానంపై సంతకానికి 12 దేశాలు తిరస్కృతి

ఓబుర్జెన్‌ (స్విట్జర్లాండ్‌): ఉక్రెయిన్‌ యుద్ధంపై పశ్చిమ దేశాల ఆధ్వర్యంలో జరిగిన స్విస్‌ శాంతి సదస్సు రూపొందించిన తుది ప్రకటనపై సంతకాలు చేయడానికి ఓ డజను దేశాలు తిరస్కరించాయి. ఈ సదస్సుకు 180 దేశాలను ఆహ్వానించగా 92 దేశాలు, 8 అంతర్జాతీయ సంస్థలు హాజరయ్యాయి. సదస్సుకు ఆహ్వానించనందున రష్యా హాజరుకాలేదు. ఒక వేళ పిలిచినా వెళ్లేది కాదు. ఎందుకంటే ఈ సదస్సు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్లు నెరవేర్చడమే ధ్యేయంగా ఏర్పాటు చేయబడింది. రష్యా లేకుండా ఉక్రెయిన్‌లో శాంతి గురించి మాట్లాడడం అర్థం లేదన్న అభిప్రాయంతో చైనా కూడా హాజరు కాలేదు.రష్యా, చైనా లేకుండా ఈ సదస్సు చేసే తీర్మానానికి విలువేముంటుందని ఆర్మేనియా, బ్రెజిల్‌, ఇండియా, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో సహా పన్నెండు దేశాలు దానికిపై సంతకానికి తిరస్కరించాయని ఆర్‌ఐఎ నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. డిక్లరేషన్‌కు 79 దేశాలు ఆమోదం తెలిపాయి. వీటిలో హంగరి, సెర్బియా, టర్కీ, జార్జియా వంటి దేశాలతో బాటు నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. తుది ప్రకటన ఇంకా బయటకు రానప్పటికీ, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల పెద్దయెత్తున మానవాళి ఇబ్బందులెదుర్కొంటున్నారని, ఆస్తుల నాశనమవుతున్నాయని, దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోందని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు నొవొస్తి వార్తా సంస్థ తెలిపింది. యుద్ధ ఖైదీల మార్పిడి పూర్తి స్థాయిలో జరగాలని, అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించాలని ఆ ప్రకటన పిలుపునిచ్చింది. ఈ సమస్యకు అర్థవంతమైన పరిష్కారం కుదరాలంటే రష్యాను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని సౌదీ అరేబియా ఇంతకుముందే వ్యాఖ్యానించింది. కొన్ని పదాలపై అభ్యంతరాలతోనే ఈ దేశాలు సంతకం చేయలేదని ఆస్ట్రియా చాన్సలర్‌ కార్ల్‌ నెమార్‌ అన్నారు. .

➡️