రఫాపై భూతల దాడులు !

May 7,2024 00:45 #19, #attack, #Israel, #peoples killed, #Rafah
  • ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్‌ హుకుం
  •  ఒప్పందానికి హమాస్‌ ఓకే తేల్చి చెప్పని ఇజ్రాయిల్‌

గాజా, జెరూసలేం : అంతర్జాతీయ సమాజం వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వం రఫాలో మరో మారణహోమానికి తెగబడేందుకు సిద్ధమైంది. వైమానిక దాడులతోబాటు భూతల దాడులు ఏక కాలంలో సాగించాలని చూస్తోంది. తూర్పు రఫా నగరాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్‌ సైన్యం సోమవారం హుకుం జారీ చేసింది. పది లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్న ఈ నగరంపై దాడి చాలా ప్రమాదకరమైన పర్యవసానాలకు దారి తీస్తుందని అరబ్‌ ప్రపంచంతో సహా పలు దేశాలు ఇజ్రాయిల్‌ను ఇప్పటికే హెచ్చరించాయి. అమెరికా, బ్రిటన్‌, ప్రాన్స్‌, జర్మనీ వంటి పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌ దుస్సాహసాన్ని నిలువరించే ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. పైగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇజ్రాయిల్‌ పట్ల తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు. బలవంతంగా రఫా నుంచి శరణార్థులను ఖాళీ చేయించడం యుద్ధ నేరం కిందికి వస్తుందని ఫ్రాన్స్‌ పేర్కొంది.
రఫాను వీడి వెళ్లాలని ఇజ్రాయిల్‌ హుకుం జారీ చేయడాన్ని ప్రమాకరమైన కవ్వింపు చర్యగా హమాస్‌ పేర్కొంది. రఫాపై దాడికి దిగితే అది ఇజ్రాయిల్‌కు పీడకలగా మిగిలిపోతుందని హెచ్చరించింది. రఫా నగరంపై జరిగే ఏ దాడైనా ఇజ్రాయిల్‌ బలగాలకు ‘పిక్నిక్‌’ లా వుండబోదని అది వ్యాఖ్యానించింది. ఇజ్రాయిల్‌ సైన్యం నుంచి ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే వేలాదిమంది ప్రజలు మూటా ముల్లె సద్దుకుని, పిల్లలు, వృద్ధులతో పరుగులు తీస్తున్న దృశ్యాలు మానవతావాదులను కలచివేస్తున్నాయి. . నుస్రత్‌, డేర్‌ ఎల్‌ బాలాV్‌ా వీధుల నుంచి ప్రజలు గుంపులు, గుంపులుగా తరలుతున్నారు. ఎక్కడ సురక్షిత ప్రాంతం వుందో కూడా తమకు అర్ధం కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయిల్‌ హుకుం జారీ చేసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, నెతన్యాహుతో మాట్లాడారు. బహుశా అమెరికా ఇచ్చిన అండతోనే ఆయన ఇంతగా పేట్రేగిపోతున్నాడు. మరో ఊచకోత మొదలవబో తోందని జోర్డాన్‌ వ్యాఖ్యానించింది. కైరోలో జరిగిన చర్చల్లో ఈజిప్ట్‌, ఖతార్‌ ప్రతిపాదించిన ముసాయిదా ఒప్పందానికి హమాస్‌ ఆమోదం తెలిపింది. ఇజ్రాయిల్‌ మాత్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. పరిస్థితులేమీ బాగా లేవని మానవతా సాయం కార్యకర్తలు తెలిపారు. మొండిగా ముందుకు సాగుతున్న ఇజ్రాయిల్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని బెల్జియం ప్రకటించింది.
రఫా నగరాన్ని వీడి వెళ్ళవద్దని పాలస్తీనియన్ల వ్యవహారాలు చూసే ఐక్యరాజ్య సమితి శరణార్ధ సంస్థ (యుఎన్‌ ఆర్‌డబ్ల్యుఎ)తో మానవతా సంస్థలకు హమాన్‌ విజ్జప్తి చేసింది. మరోవైపు, ఈజిప్ట్‌ రాజధాని కైరోలో కాల్పుల విరమణ చర్చలు విపలమయ్యాయి. నెతన్యాహు అనుసరించిన నిరంకుశ వైఖరే దీనికి కారణమని హమాస్‌ విమర్శించింది.
ఆమోదయోగ్యం కాదు
రఫాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్‌ జారీ చేసిన ఆదేశాలు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని యురోపియన్‌ యూనియన్‌ దౌత్యవేత్త జోసెఫ్‌ బారెల్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. భద్రతా మండలి ఆమోదించిన 2728 తీర్మానాన్ని ఇజ్రాయిల్‌ తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన కోరారు.

➡️