రఫాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు – 35 మంది మృతి

May 27,2024 10:02 #35, #dead, #Israel, #Israeli bombings, #Rafah

గాజా : గాజాలోని రఫాలో ఇజ్రాయెల్‌ మరోసారి చెలరేగిపోయింది. ఇజ్రాయెల్‌ ఆదివారం జరిపిన దాడుల్లో దాదాపు 35 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మృతులు, గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు రఫాలో సరిపడా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులేమీ లేవని పేర్కొంది.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ….
ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం రఫా నగరంపై బాంబు దాడులకు తెగబడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దాదాపు 35 మంది చనిపోయినట్టు గాజా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. ఇక, అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంపై బాంబు దాడుల జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మాకేమీ తెలీదు : ఇజ్రాయెల్‌
ఇదిలా ఉండగా… రఫాపై తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్‌ చెబుతోంది. ఈ దాడులతో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. రఫాలో ఏం జరుగుతుందో తమకు తెలియదని తెలిపింది. మరోవైపు.. అంతకుముందు ఇజ్రాయెల్‌ రాజధాని టెలీ అవీవ్‌పై హమాస్‌ రాకెట్లతో విరుచుకుపడటంతో రాజధానిలో సైరన్లు మోగాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల కారణంగానే తాము ప్రతిదాడులు చేసినట్టు హమాస్‌ వివరించింది.

అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలపై ఇజ్రాయెల్‌ బేఖాతరు…
అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్‌ బేఖాతరు చేసింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే ఆపాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దాడులను ఆపకపోతే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీజే ఆదేశాలను పట్టించుకోకుండా తాజాగా మరోసారి ఇజ్రాయెల్‌ బాంబు దాడులకు తెగబడింది. గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ వారాంతంలో ఇజ్రాయెల్‌, యుఎస్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఖతార్‌ ప్రధాన మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్రహ్మాన్‌ బిన్‌ జాసిమ్‌ అల్‌ థానీ మధ్య జరిగే సమావేశాల తర్వాత కాల్పుల విరమణ చర్చపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

➡️