తైవాన్‌కు అమెరికా ఆయుధ విక్రయాలను ఖండించిన చైనా

Dec 20,2023 09:49 #Exports, #Imports, #Taiwan, #Weapons
america exports to weapons to taiwan

బీజింగ్‌ : తైవాన్‌ ప్రాంతానికి అమెరికా ఆయుధాల విక్రయాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఈ విక్రయంపై తీవ్ర అసంతృప్తితోనూ, వ్యతిరేకతతోనూ ఉన్నామని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం ప్రకటించారు. తైవాన్‌కు 300 మిలియన్‌ డాలర్ల ఆయుధాల విక్రయానికి సంబంధించి ఇటీవల అమెరికా డిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వు కియాన్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనతో చైనా-అమెరికా ఉమ్మడి కమ్యూనిక్స్‌ ముఖ్యంగా ఆగస్టు 17 కమ్యూనిక్‌ను అమెరికా ఉల్లంగించిందని తెలిపారు. అమెరికా చర్య చైనా సార్వభౌమాధికారం, భద్రతను తీవ్రంగా దెబ్బతీసిందని, తైవాన్‌ జలసంధి అంతటా శాంతి-స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని విమర్శించారు. అలాగే తైవాన్‌ వేర్పాటువాదులకు తప్పుడు సంకేతాలను పంపిస్తుందని తెలిపారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని నిలిపివేయాలని అమెరికాను కోరారు. చైనాను అదుపు చేసేందుకు తైవాన్‌ను ఉపయోగించుకోవాలనే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందని హెచ్చరించారు. చైనా జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ధృడంగా పరిరక్షించడానికి, జలసంధి అంతటా శాంతి, స్థిరత్వాన్ని కాపాడ్డానికి ఆర్మీ సంసిద్ధతతో ఉందని స్పష్టం చేశారు.

➡️