ట్రంప్‌ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు : బైడెన్‌

Jan 6,2024 17:08 #America, #Joe Biden, #Trump

పెన్సిల్వేనియా : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు. ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాకు తీవ్రంగా ప్రమాదం ఉంటుందని, అందుకే ఈ ఏడాది ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ట్రంప్‌ని ఎన్నుకోవద్దని బైడెన్‌ ఓటర్లను హెచ్చరించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయారు. మళ్లీ ట్రంప్‌నే అధ్యక్షుడు అవ్వాలని అతని మద్దతుదారులు 2021 జనవరి 6వ తేదీన అధ్యక్ష భవనంపై దాడి చేశారు. ఈ దాడి మూడవ వార్షికోత్సవానికి ఒకరోజు ముందు జనవరి 5 శుక్రవారం బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం పెన్సిల్వేనియాలోని బ్లూబెల్‌లోని కమ్యూనిటీ కాలేజీలో మాట్లాడుతూ.. ‘ట్రంప్‌, అతని అనుచరులు ప్రమాదకారులు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే డెమోక్రాట్లు, స్వతంత్రులు, ప్రధానస్రవంతి రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వాలి.’ అని కోరారు. అలాగే ప్రజాస్వామ్యం బ్యాలెట్‌లో ఉంది. మీ స్వేచ్ఛ బ్యాలెట్‌లో ఉంది. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం గతంలో ఉంది. కానీ భవిష్యత్తులో కాదు. అయితే ట్రంప్‌ ప్రజాస్వామ్యంపై దాడి కేవలం గతంలో కాదు.. భవిష్యత్తులో కూడా నాశనం చేసేందుకు పూనుకున్నాడు. ట్రంప్‌ ఓ రాక్షసుడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే.. అతనికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలి.’ అని బైడెన్‌ అన్నారు.

కాగా, ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2021లో ట్రంప్‌ మద్దతుదారులు అధ్యక్షభవనంపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన కేసులో ట్రంప్‌ అధ్యక్ష అభ్యర్థికి అనర్హుడిగా కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రిపబ్లికన్‌ పార్టీ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై తుది నిర్ణయం సుప్రీంకోర్టే తీసుకునే అవకాశం ఉంది.

➡️