వచ్చే సోమవారం నాటికి కాల్పుల విరమణపై ప్రకటన : బైడెన్‌

న్యూయార్క్‌ :    వచ్చే సోమవారం నాటికి గాజాపై కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. న్యూయార్క్‌ పర్యటన సందర్భంగా బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. చర్చలు కొనసాగుతున్నాయని తమ జాతీయ భద్రతా సలహాదారు వెల్లడించారని, అయితే ఇంకా పూర్తికాలేదని అన్నారు. పాలస్తీనా భూభాగంపై కొనసాగుతున్న మానవ సంక్షోభం మధ్య, ఇజ్రాయిల్‌ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఈజిప్ట్‌, ఖతార్‌, అమెరికా, ఫ్రాన్స్‌ ఇతర ప్రాంతాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. గాజాపై దాడిని నిలిపివేయాలని, ఇజ్రాయిల్‌ బందీలను విడుదల చేయాలని కోరుతున్నారు. పలువురు ప్రతినిధులు, గాజా పాలకులు (హమాస్‌ నేతలు లేకుండా) వారాంతంలో పారిస్‌లో సమావేశమయ్యారు. తాత్కాలిక కాల్పుల విరమణ కోసం బందీల విడుదలకు సంబంధించి ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చారని వైట్‌ హౌస్‌ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ పేర్కొన్నారు. పారిస్‌ సమావేశం అనంతరం ఇటీవల ఈజిప్ట్‌, ఖతారీ, అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌, హమాస్‌ ప్రతినిధులు కూడా సమావేశమయ్యారని ఈజిప్ట్‌ మీడియా వెల్లడించింది.  ముస్లింల పవిత్రమాసమైన రంజాన్‌కు ముందు సంధి నెలకొనాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.  వివాదాస్పద అంశాలపై ” కొన్ని నూతన  సవరణలు” ప్రతిపాదించామని, అయితే కాల్పుల విరమణ, గాజాస్ట్రిప్‌పై సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇజ్రాయిల్‌ ఎటువంటి  స్పష్టమైన  వైఖరిని ప్రకటించలేదని హమాస్‌ వర్గాలు తెలిపాయి.

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై దాడి .. ముగ్గురు మృతి

ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఫారా శరణార్థి శిబిరంపై కూడా సైన్యం విరుచుకుపడినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

➡️