ట్రంప్‌కు భారీ షాక్‌.. కొలరాడో సుప్రీం కోర్టు కీలక తీర్పు

వాషింగ్టన్‌ (అమెరికా) : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలింది. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరిపించిన కారణంగా అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్‌ అనర్హుడని ప్రకటిస్తూ కొలరాడో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న ఓ వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ సెక్షన్‌ 3 ప్రకారం అధ్యక్ష అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించడం మొదటిసారి. కాగా ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని కోర్టు ట్రంప్‌నకు కల్పించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హుడని 4-3 మెజార్టీతో జడ్జిలు తీర్పు ఇచ్చారు. కొలరాడోలో ప్రైమరీ బ్యాలెట్‌ నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు తొలగించారు. దీంతో డొనాల్డ్‌ ట్రంప్‌ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. ఈ తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో రిపబ్లికన్స్‌ ప్రైమరీ బ్యాలట్‌పై మాత్రమే కాకుండా నవంబర్‌ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనుంది.

➡️