నేను గెలవకపోతే అమెరికాలో ‘రక్తపాతమే’: ట్రంప్‌

Mar 18,2024 00:18 #America, #elections, #Trump
  • చైనా కార్లను అనుమతించబోం..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌తో మరోసారి పోటీకి సిద్ధమైన డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌ 5న జరగబోయే ఎన్నికలు అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నాయని అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే దేశంలో ‘రక్తపాతం’ మొదలవుతుందని పేర్కొన్నారు. బైడెన్‌ విధానాలను విమర్శిస్తూ ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని కూడా ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనని తెలిపారు. 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్‌ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను గెలవకపోతే.. బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని అన్నారు.
ట్రంప్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కారోలిన్‌ లీవిట్‌ వివరణ ఇచ్చారు. బైడెన్‌ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ‘ఆర్థిక రక్తపాతం’ మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్‌ సానుభూతి ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో క్యాపిటల్‌ హిల్‌పై దాడి ఘటనలో అరెస్టయిన వారిని ఆయన ‘బందీలు’గా, ‘దేశభక్తులు’గా అభివర్ణించడం గమనార్హం. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను బైడెన్‌ ప్రచార బృందం తప్పుబట్టింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఆయన మరోసారి రాజకీయ హింసకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. ఆయన ప్రతీకారాన్ని, అతివాదాన్ని ఓటర్లు మరోసారి ఓడిస్తారని వ్యాఖ్యానించింది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి కావాల్సిన ప్రతినిధుల మద్దతును డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ నుంచి ట్రంప్‌ సాధించిన విషయం తెలిసిందే. నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో వీరు తలపడనున్నారు.
ట్రంప్‌నకు నా మద్దతు లేదు: మైక్‌ పెన్స్‌
ట్రంప్‌ అభ్యర్థిత్వానికి తాను మద్దతివ్వడం లేదని ఆయన సొంత పార్టీ కీలక నేత మైక్‌ పెన్స్‌ తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్‌ అనేక విషయాల్లో పార్టీ విధానాలకు కట్టుబడలేదని వ్యాఖ్యానించారు. తనకు, ట్రంప్‌నకు మధ్య చాలా వ్యత్యాసముందన్నారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యాంగానికి లోబడే పనిచేశానన్నారు. ఎక్కడా ఒత్తిళ్లకు తలొగ్గి దారి తప్పలేదని.. అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు. ట్రంప్‌ హయాంలో పెన్స్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఫలితాల అనంతరం ట్రంప్‌ అనుసరించిన వైఖరి, ఆయన మద్దతుదారులు క్యాపిటల్‌ హిల్‌పై దాడికి దిగడాన్ని పెన్స్‌ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.

➡️