జులై4న బ్రిటన్‌ ఎన్నికలు

May 23,2024 00:20 #prakatana, #sunak

పార్లమెంటు రద్దుకు రాజు ఆమోదం
సునాక్‌ ప్రకటన
లండన్‌: పద్నాలుగేళ్ల కన్సర్వేటివ్‌ ప్రభుత్వం ఓటమి ఖాయమని ఒపీనియన్‌ పోల్స్‌తో సహా అందరూ భావిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (44) అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు రద్దుకు రాజు ఆమోదం తెలిపారని, జులై4న పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని బుధవారం నంబర్‌ టెన్‌ డౌనింగ్‌ స్ట్రీట్‌ వెలుపల నిలబడి ఆయన వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు వర్షాకాలంలో జరుగుతాయని ఇంతవరకు చెబుతూ వచ్చిన సునాక్‌ ఆకస్మికంగా ఈ ముందస్తుకు వెళ్లడంలో ఆంతర్యం తెలియనిదేమీ కాదు. ముందస్తు ఎన్నికలతో ఆయన జూదమాడుతున్నారని విశ్లేషకులు పలువురు పేర్కొంటున్నారు. పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌కు బాహాటంగా సునాక్‌ ప్రభుత్వం మద్దతు పలకడం, రష్యాను దెబ్బతీయడం కోసం ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఎగదోస్తుండడం, అమెరికాతో కలసి సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్ధాల్లో పాల్గనడం వంటి విధానాల పట్ల, అలాగే దేశీయంగా సామాన్యులపై భారాలు మోపి, సంపన్నులకు రాయితీలు ఇవ్వడం, ప్రభుత్వ రంగంలోని రైల్వేలను, ప్రజారోగ్య రంగాన్ని ప్రైవేటీకరించే యత్నాలపైన బ్రిటన్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత నాలుగేళ్లలో నల్గురు ప్రధానులు మారడం బ్రిటన్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తెలియజేస్తోంది. సునాక్‌ మాత్రం తన ప్రభుత్వం ఆర్థిక సుస్థిరతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని, కోవిడ్‌-19 సమయంలో చ్కీట్లో వున్న ప్రజలను ఆదుకునేందుకు చేతనైనంత సాయం చేశామని చెప్పుకొచ్చారు. రుణ భారాన్ని అదుపు చేశామని, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమైన లేబర్‌ పార్టీ నమ్మదగినది కాదని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో లేబర్‌ పార్టీ కన్నా కన్సర్వేటివ్‌ పార్టీ (వీరిని టోరీలని కూడా పిలుస్తారు) 20 పాయింట్లు వెనకబడి ఉన్నట్లు వెల్లడైంది.బ్యాంకర్‌గా, గతంలో బ్యాంకర్‌గా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన సునాక్‌ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి పట్టుమని ఆరు వారాల వ్యవధి కూడా లేకపోవడంతో ఇప్పటి నుంచే రెండు ప్రధాన పార్టీలు ప్రచారం మొదలెట్టాయి.

➡️