గాజాకు సంఘీభావంగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న ఐరోపా

May 10,2024 08:06 #Gaza, #struggling Europe

స్పెయిన్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం,ఫ్రాన్స్‌, జర్మనీ అంతటా నిరసనలు
అమెరికా నుండి ఐరోపాకు విస్తరించిన ఉద్యమం
మాడ్రిడ్‌/లండన్‌: గాజాకు సంఘీభావంగా అమెరికాలో ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు యూరప్‌నూ కుదిపేస్తోంది. ఉత్తర గాజాపై దాడి చేసి 35వేల మంది అమాయక పౌరుల ప్రాణాలు తోడేసిన ఇజ్రాయిల్‌ తాజాగా దక్షిణ గాజా నగరం రఫాలో మరో సామూహిక మారణ హోమానికి తెగబడుతున్న తరుణంలో దీనికి వ్యతిరేకంగా గ్లోబల్‌ నార్త్‌ ( ప్రధానంగా అమెరికా, ఐరోపా) విద్యార్థులు పెద్దయెత్తున వీధుల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థులతీ విధంగా కదలడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వియత్నాంపై సామ్రాజ్యవాద యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా, యూరప్‌లలో పెద్దయెత్తున విద్యార్థులు నిరసనలు తెలిపారు.
స్పెయిన్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం,జర్మనీ, ఫ్రాన్స్‌తో సహా యావత్‌ ఐరోపా ఖండం నేడు విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతోంది. . గాజాలో ఇజ్రాయిల్‌ దురాగతాలతో సంబంధమున్న కంపెనీల్లో యూనివర్సిటీ ఎండోమెంట్‌ ట్రస్టు ఫండ్‌ను పెట్టుబడిగా పెట్టడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇజ్రాయిల్‌లోని జాత్యహంకార నెతన్యాహు ప్రభుత్వంతో సంబంధాలు తెంచుకోవాలని వారు ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.
నిరసనకారులపై ఇదివరకెన్నడూ లేనంత ప్రభుత్వాలు దారుణమైన అణచివేతకు పాల్పడుతున్నాయి. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డమ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల నిరసన గుడారాలను పోలీసులు బుల్డోజర్లతో కూల్చివేయడం, బ్యాటన్‌లతో బాదడం, బలవంతంగా ఈడ్చుకెళ్లడం వంటి దృశ్యాలతో కూడిన వీడియోలు బయటకు రావడంతో ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పారిస్‌లో మంగళవారం రాత్రి విద్యార్థుల నిరసన శిబిరంపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. అదే రోజు బెర్లిన్‌లోని ఫ్రీలె యూనివర్సిటీ నిరసన గుడారాల నుంచి విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు ఈడ్చేశారు. డజన్ల కొద్దీ టెంట్లను తొలగించారు. నిరసనల్లో పాల్గన్న విద్యార్థులపై తప్పుడు అభియోగాలు మోపి కేంపస్‌ నుంచి బహిష్కరించడం వంటివి చేస్తున్నారు.
స్పెయిన్‌లోని బార్సిలోనా, బాస్క్యూ కౌంటీ యూనివర్సిటీల వెలుపల గుడారాలు వేసుకుని నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీలసులు దాడి చేసి టెంట్లను కూల్చేశారు. పెద్దయెత్తున అరెస్టులు చేశారు. దేశవ్యాపితంగా ఉన్న 77 ప్రభుత్వ, ప్రైవేట్‌ యూనివర్సిటీలతో కూడిన నాన్‌ ప్రాఫిట్‌ అసోసియేషన్‌ గురువారం నాడు ఒక ప్రకటన చేస్తూ అంతర్జాతీయ శాంతి, మానవతా చట్టాలకు విరుద్ధంగా ఉండే అగ్రిమెంట్లను సమీక్షించి, రద్దు చేసే విషయం పరిశీలిస్తామని తెలిపింది. అనేక చోట్ల విద్యార్థులకు మద్దతుగా అధ్యాపక సిబ్బంది ముందుకొస్తున్నారు. నిరసనలను అణచివేసేందుకు జర్మన్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించింది. అమెరికాలో చాలా యూనివర్సిటీలు పోలీసులను రప్పించి మిలిటరీ తరహా ఎత్తుగడలతో అణచివేయాలని చూశాయి. అయితే, ఈ ఉద్యమం క్యాంపస్‌ ల నుంచి వీధుల దాకా విస్తరించింది.
అమెరికా తరువాత బ్రిటన్‌లో ఈ నిరసనలు పెద్దయెత్తున ఎగసిపడుతున్నాయి. మాంఛెస్టర్‌, షెఫీల్డ్‌, లండన్‌ సహా పలు యూనివర్సిటీల వెలుపల వందలాది నిరసన గుడారాలు ఏర్పాటు చేసుకుని గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా. కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ తదితర యూనివర్సిటీలు విద్యార్థుల నిరసనలతో హోరెత్తుతున్నాయి. ప్రధాని సునాక్‌ ఈ నిరసనలపై చర్చించేందుకు ఈ వారంలో విసిల సమావేశం నిర్వహించనున్నారు. యూనివర్సిటీ విసిలు చాలా మంది విద్యార్థుల భావాలకు మద్దతుగా నిలవడంతో సునాక్‌ ఇరకాటంలో పడ్డారు. ఒక వైపు పొదుపు చర్యల పేరుతో దేశీయంగా ప్రజలపై భారాలు మోపుతూ, మరో వైపు ప్రజా నిధులను ఇజ్రాయిల్‌లో మారణకాండకు వెచ్చిస్తారా అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా నిలయాలుగా ఉండాల్సిన యూనివర్సిటీలను యుద్ధాలకు నిధులు సమకూర్చేవిగా మారుస్తారా అంటూ వారు నినదిస్తున్నారు.
ఒక క్రాసింగ్‌ను తెరిచాం: ఇజ్రాయిల్‌
మానవతా సాయం అడ్డుకుంటున్నారు:ఐరాస
మూసివేసిన కెరేమ్‌ షలోమ్‌ క్రాసింగ్‌ను బుధవారం నుడి తిరిగి తెరిచి ఉంచామని ఇజ్రాయిల్‌ సైన్యం చెప్పింది. అయితే, అక్కడ అనేక ఆంక్షలు పెట్టి మానవతా సాయం ఏదీ గాజా లోపలికి రాకుండా చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది. రఫాపై ఇజ్రాయిల్‌ దాడి చేస్తే అది మరో మానవ విపత్తుకు దారి తీస్తుందని ఐరాస హెచ్చరించింది. గాజాకు, ఈజిప్టుకు అనుసంధానంగా ఉన్న రెండు ప్రధాన సరిహద్దు మార్గాలను ఇజ్రాయిల్‌ మూసివేసి పూర్తి స్థాయి దాడికి సిద్ధమైంది. దీంతో ఆ ప్రాంతంలోని 13 లక్షల మంది పాలస్తీనీయులు ఎటూ పోలేని స్థితిలో ఉన్నారు. ఆహారం, మంచినీరు, మందులు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరగాజాలో మాదిరే రఫాలోను తీవ్ర క్షామం నెలకొనే ప్రమాదముంది.

➡️