సాయం కోసం ఎదురుచూస్తున్న వారిపై ఇజ్రాయిల్‌ కాల్పులు .. ఐదుగురు మృతి

గాజా :   ఉత్తర గాజాలో పాలస్తీనియన్‌లపై శనివారం ఇజ్రాయిల్‌ మరోసారి విరుచుకుపడింది. సాయం కోసం వేచివున్న వారిపై జరిపిన తుపాకీ కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు పాలస్తీనా రెడ్‌ క్రెసెంట్‌ తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో డజన్ల కొద్తీ గాయపడ్డారని పేర్కొంది. ఈ ప్రాంతంలో కరువు పొంచి ఉందని తెలిపింది.

ఉత్తర గాజా భూభాగంలోని కువైట్‌ జంక్షన్‌ వద్దకు సుమారు 15 ట్రక్కుల పిండి, ఇతర ఆహార పదార్థాలు చేరుకోవాల్సి వుండగా, వేలాది మంది ప్రజలు ఆప్రాంతంలో వేచిచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పాలస్తీనా రెడ్‌ క్రసెంట్‌ తెలిపింది.

ఈ ప్రాంతంలో పలు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. మార్చి 23న ఇజ్రాయిల్‌ చేపట్టిన అమానవీయ కాల్పులు జరిపినట్లు హమాస్‌ ప్రభుత్వం పేర్కొంది. ఆ ఘటనలో 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయిల్‌ ఈ ఆరోపణలను తిరస్కరించింది.

శిథిలాల మధ్య నుండి ట్రక్కుల కాన్వారు సాయం పంపిణీ పాయింట్‌కు చేరుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాలస్తీనియన్ల అరుపులు, కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. కొందరు హెచ్చరికలు చేస్తున్న శబ్దాలు కూడా వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

సహాయ పంపిణీని పర్యవేక్షిస్తున్న సమయంలో ఇజ్రాయిల్‌ దళాలు కాల్పులు జరిపాయని, దీంతో ట్రక్కులు ప్రజలపైకి దూసుకు వెళ్లాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఆకలి ‘విపత్తు’ ను ఎదుర్కోనున్న ఉత్తర  గాజా 

గాజాలోని జనాభాలో సగం మందికి పైగా ఆకలి విపత్తు ను ఎదుర్కొంటున్నారని ఈనెల 19న ఐరాస ప్రకటించింది. తక్షణమే జోక్యం చేసుకోకుంటే కరువు ఉత్తర గాజాను కూడా తాకుతుందని అంచనావేసింది. యుఎన్‌ నివేదిక ప్రకారం.. మిలియన్ల గాజా జనాభాలో సగం మంది విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అంచనా వేసింది. ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా ఉందని ఐరాస హెచ్చరించింది. నివేదిక ప్రకారం.. సుమారు మూడు లక్షల మందికి మార్చి మరియు మే మధ్య కరువు పొంచి వుందని అంచనా వేసింది.

➡️