ఇజ్రాయిల్‌ గూఢచర్యం కేసులో నలుగురికి ఉరి

Jan 30,2024 11:27 #Iran

దుబాయ్: ఇజ్రాయిల్‌ తో కలసి గూఢచర్యానికి పాల్పడిన కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఇరాన్‌ సోమవారం ఉరి తీసింది. ఆ నలుగురు చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించడంతో శిక్షను అమలు చేసినట్లు ఇరాన్‌ వార్తా సంస్థ ఇర్నా తెలియజేసింది. ఇరాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ కోసం సామాగ్రిని తయారుచేస్తున్న ఇస్ఫాన్‌ నగరంలోని ఫ్యాక్టరీపై బాంబు దాడి చేసేందుకు ఇరాక్‌లోని కుర్దిష్‌ ప్రాంతం నుండి ఇరాన్‌ భూభాగంలోకి ఈ నలుగురు అక్రమంగా ప్రవేశించారని మీడియా వార్తలు తెలిపాయి. ఇజ్రాయిల్‌ మొసాద్‌ తరపున 2022 వేసవి కాలంలో వీరు గూఢచర్యానికి పాల్పడి ఇరాన్‌ చేతికి చిక్కారు. అణు కార్యక్రమంపై ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య వివాదం దీర్ఘకాలంగా నెలకొంది. తమపై తీవ్రవాద దాడులకు ఇరాన్‌ పాల్పడుతోందంటూ ఇజ్రాయిల్‌ ఆరోపిస్తుండగా, తమ అధికారులను,, శాస్త్రవేత్తలను అనేకమందిని ఇజ్రాయిల్‌ హతమార్చిందని ఇరాన్‌ ఆరోపిస్తోంది.

➡️