రెండో రౌండ్‌ దిశగా ఫ్రాన్స్‌

  • మొదటి రెండు స్థానాల్లో లీపెన్‌, లెఫ్ట్‌ కూటమి

పారిస్‌ : మొదటి రౌండ్‌ ఫ్రెంచ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో మాక్రాన్‌ నేతృత్వంలోని మధ్యేవాద నయా ఉదారవాద పార్టీ రినైజాన్స్‌కు వామపక్ష, ప్రగతిశీల శక్తులతో కూడిన పాపులర్‌ ఫ్రంట్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. 29 శాతం ఓట్లతో పాపులర్‌ ఫ్రంట్‌ రెండవ స్థానంలో నిలవగా, మాక్రాన్‌ పార్టీ మూడవ స్థానంలో నిలిచింది. దీంతో మాక్రాన్‌కు వచ్చే మూడేళ్లు దినదిన గండమే. పచ్చి మితవాద పార్టీ నేషనల్‌ ర్యాలీకి 34 శాతం ఓట్లు రాగా, మాక్రాన్‌ పార్టీకి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. లీపెన్‌ పార్టీకి, పాపులర్‌ ఫ్రంట్‌కు మధ్య ఓట్ల తేడా కేవలం 5 శాతం మాత్రమే. మొదటి రౌండ్‌లో ఏ పార్టీకి లేదా కూటమికి మెజార్టీకి అవసరమైన 50శాతానికి పైగా ఓట్లు లేదా నమోదయిన మొత్తం ఓటర్లలో 25 శాతం దాకా లభించకపోతే రనాఫ్‌ ఎన్నికలు అనివార్యం. ఆదివారం జరిగిన ఎన్నికల్లో గత నలబై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా పోలింగ్‌ శాతం నమోదయింది. మొదటి రౌండ్‌లో 60 మంది అభ్యర్థులు ఎన్నిక కాగా, వీరిలో నేషనల్‌ ర్యాలీ నుంచి 38 మంది, పాపులర్‌ ఫ్రంట్‌ నుంచి 21 మంది, మాక్రాన్‌ పారీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఈ నెల 7న జరిగే రెండో రౌండ్‌ ఎన్నికల్లో 500 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది.ఈసారి హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఫలితంగా మరింత రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని భావిస్తున్నారు. రద్దైన పార్లమెంట్‌లో నేషనల్‌ ర్యాలీకి కేవలం 88 సీట్లే వున్నాయి. రెండో రౌండ్‌ ఎన్నికల్లో లీపెన్‌ పార్టీకి, పాపులర్‌ ఫ్రంట్‌కు మధ్య ఓట్లలో అంతరం మరింత తగ్గే అవకాశముంది. వచ్చే నాలుగైదు రోజులు ప్రచారం మరింత ఉధృతం కానుంది. పచ్చి మితవాద శక్తులు బలం పుంజుకోవడం పట్ల ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌, లిల్లీ, పారిస్‌ తదితర నగరాల్లో ఇప్పటికే నిరసనలు, ఆందోళనలను మొదలయ్యాయి. ఈ ప్రదర్శనలకు నాయకత్వ వహించిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ నాయకుతులు మాట్లాడుతూ, ప్రస్తుతం సాధించిన దాంతో సంబరపడకుండా, రానున్న రోజుల్లో మరింత పెద్దయెత్తున ప్రజలను సమీకరించాల్సిన అవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ఈ పోరాటం కొనసాగాలని ‘నేషనల్‌ కో-ఆర్టినేటర్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ అన్‌బౌడ్‌’ మానియెల్‌ బంపార్డ్‌ అన్నారు.

➡️