ఫ్రాన్స్‌ కొత్త ప్రధానిగా గాబ్రియెల్‌

Jan 10,2024 10:39 #France, #prime minister

పారిస్‌ : ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ 34 ఏళ్ల విద్యా శాఖ మంత్రి గాబ్రియెల్‌ అట్టల్‌ ను దేశ కొత్త ప్రధానిగా నియమించారు. జూన్‌లో యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన ఈ చర్య తీసుకోవడం గమనార్హం. మాక్రాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పదమైన కొత్త పింఛను విధానం, వలస వ్యతిరేక చట్టాలపై ఫ్రెంచి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మాక్రాన్‌ ప్రభుత్వం ఎంతగా అప్రతిష్టపాలవ్వాలో అంతగా అయింది. మాక్రాన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని పచ్చి మితవాద మెరిలిన్‌ లీపెన్స్‌ పార్టీ ముందుకొస్తున్నది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో లీపెన్స్‌ పార్టీ కన్నా మాక్రాన్‌ పార్టీ 10 పాయింట్ల తేడాతో వెనకబడి ఉంది. మాక్రాన్‌కు సన్నిహితుడైన అట్టల్‌ కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించారు. ఆ రకంగా దేశమంతా ఇంటింట చిరపరిచితమైన యువ నేత. పదవి నుండి వైదొలగుతున్న ఎలిజబెత్‌ బార్న్‌ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.. ప్రధానిని మార్చడం వల్ల పెద్దగా మాక్రాన్‌ గ్రాఫ్‌ పెరిగే పరిస్థితి ఏమీ లేదని ప్ర్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. బార్న్‌ అయినా అట్టల్‌ అయినా దొందూ దొందేనని పేర్కొన్నాయి.

➡️