ఐసిజె ఆదేశాలు బేఖాతరు

May 25,2024 23:47 #attack, #issrel, #rafa
  •  కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ దాడులు

రఫా:ఇజ్రాయిల్‌ వరుస దాడులతో గాజా, రఫా పరిసర ప్రాంతాల్లో మానవీయ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. మంచినీరు, ఆహారం, మందులు అందక అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 17 రోజులుగా ఆస్పత్రులకు ఇంధనం, నీటి సరఫరా బంద్‌ అయింది., వైద్య సరఫరాలు కూడా నిలిచిపోయాయి.. దాదాపు కుప్పకూలే పరిస్థితిలో వుంది. గాజాలో యుద్ధం మొదలైన తొలినాళ్ళలో వున్న పరిస్థితులే నేడు రఫాలో కనిపిస్తున్నాయి. ఉత్తర గాజాలోని ఒక స్కూలుపై జరిగిన దాడిలో పదిమంది పాలస్తీనియన్లు మరణించారు. 17 మంది గాయపడ్డారు. ఆ పొరుగు ప్రాంతాల నుండి పారిపోయి వచ్చి ఆ స్కూల్లో చాలామంది తలదాచుకున్నారు. జాబాలియా శరణార్ధ శిబిరంపై కూడా భీకరంగా దాడి జరిగింది. అనేకమంది అక్కడ నుండి పారిపోయారు. వెస్ట్‌ బ్యాంక్‌లో జరుగుతున్న దాడుల్లో 15 మంది పాలీస్తీనియన్లను ఇజ్రాయిల్‌ సైన్యం అపహరించింది. ఇప్పటివరకు 8,855 మందిని ఇలా అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ప్రిజనర్స్‌ సొసైటీ తెలిపింది. ఇప్పటివరకు గాజాలో 35,857 మంది మరణించగా, 80,293 మంది గాయపడ్డారు. గాజాలో జరుగుతున్న విషాదం మాటలకందనిదని ఐక్యరాజ్య సమితి అత్యవసర సహాయ కార్యకలాపాల చీఫ్‌ వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ దారుణాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు.

తక్షణ కాల్పుల విరమణ కోసం పెరుగుతున్న ఒత్తిడి
రఫాలోను, గాజాలోని ఇతర ప్రాంతాలపైన దాడులను ఇజ్రాయిల్‌ తక్షణమే నిలిపేయాలని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ న్యాయ స్థానం (ఐసిజె) ఆదేశించిన నేపథ్యంలో నెతన్యాహు ప్రభుత్వంపై ప్రపంచ దేశాల ఒత్తిడి మరింత పెరిగింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ మూడు యూరోపియన్‌ దేశాలు(స్పెయిన్‌, నార్వే, ఐర్లండ్‌ ) ఇటీవల ప్రకటించడంతో తీవ్ర ఇరకాటంలో పడ్డ నెతన్యాహుకు శుక్రవారం నాటి ఐసిజె ఆదేశం చెంపపెట్టు లాంటిది.
ఈ స్థితిలో తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాలంటూ అమెరికా, బ్రిటన్‌, జర్మనీ మినహా చాలా వరకు ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాయి. జోర్డాన్‌ రాజుర అబ్దుల్లా-2, ఒమన్‌ సుల్తాన్‌ హిఈతమ్‌ బిన్‌ తారిఖ్‌, ఐరాసలో మొరాకో రాయబారి హిలాల్‌ ఇజ్రాయిల్‌ వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు. ఐసిజె ఆదేశాలను, ప్రపంచ నేతల డిమాండ్‌ను బేఖాతరు చేస్తూ రఫాలో ఇజ్రాయిల్‌ ఊచకోత కొనసాగిస్తుంది.

తక్షణమే నిధులు విడుదలకు జి7 వినతి
పాలస్తీనా తక్షణ ఆర్థికావసరాలను దృష్టిలో వుంచుకుని విత్‌హెల్డ్‌లో పెట్టిన పాలస్తీనా అథారిటీ నిధులను తక్షణమే విడుదల చేయాలని జి-7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం ఇజ్రాయిల్‌కు విజ్ఞప్తి చేశారు. స్టెరిసాలో సమావేశమైన వీరు గాజాలో పరిస్థితులపై చర్చించారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో కీలకమైన ఆర్థిక లావాదేవీలకు అంతరాయం కలిగించవద్దని వారు కోరారు. పాలస్తీనా బ్యాంకులతో లావాదేవీలను నిలిపివేయడానికి ఇజ్రాయిల్‌ యోచిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వినతి వెలువడింది. ఇజ్రాయిల్‌, పాలస్తీనా బ్యాంకుల మధ్య కొనసాగుతున్న బ్యాంకింగ్‌ సేవలు యధావిధిగా సాగేలా చూడాలని కోరారు.

 

➡️