గాజాలో తక్షణమే కాల్పుల విరమణ

Jun 12,2024 09:16 #ceasefire, #Gaza, #immediate

అమెరికా ప్రతిపాదిత తీర్మానానికి భద్రతా మండలి ఆమోదం
ఓటింగ్‌కు దూరంగా ఉన్న రష్యా
న్యూయార్క్‌ : గాజాలో వెంటనే కాల్పులు విరమించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరోసారి తీర్మానం చేసింది. ఇజ్రాయిల్‌ దాడులను అంతమొందించేందుకు మూడంచెల కాల్పుల విరమణకు సంబంధించిన సమగ్ర ఒప్పందానికి ఇరుపక్షాలు వచ్చేలా చూసేందుకు ఈ తీర్మానం దోహదపడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానించారు. భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాలకు గాను 14 దేశాలు అనుకూలంగా ఓటు చేశాయి. రష్యా ఓటింగ్‌కు దూరంగా ఉంది. గత నెల్లో బైడెన్‌ ప్రకటించిన మూడంచెల కాల్పుల విరమణ ప్రణాళికను పూర్తి స్థాయిలో అమల్జేయాలని ఈ తీర్మానం ఇరుపక్షాలను కోరింది. తొలి దశలో భాగంగా తొలుత ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలని, గాజాలో కొంతమంది బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయిల్‌ జైళ్ళలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని ఆ తీర్మానం కోరుతోంది. ఇక రెండో దశలో శాశ్వత కాల్పుల విరమణ, మిగిలిన బందీల విడుదల అమలు జరగాలి. పూర్తిగా ధ్వంసమైన గాజా పునర్నిర్మాణ యత్నాలు మూడో దశలో చేపట్టాలి. ఎలాంటి షరతులు లేకుండా ఈ తీర్మానాన్ని ఇరు పక్షాలు పూర్తిగా అమలు చేయాలని కోరింది. తీర్మానంపై హమాస్‌ స్పందిస్తూ ఈ విషయంలో మధ్యవర్తులకు సహకరించడానికి తాము సిద్ధంగా వున్నామని చెప్పింది.ఈ మూడంచెల కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయిల్‌ తీవ్రంగా విమర్శించింది. ఐరాస తీర్మానాలను బేఖాతరు చేస్తూ గాజాపై నెతన్యాహు నరహంతక దాడులు కొనసాగిస్తూనే ఉంది.

➡️