ఇస్లామోఫోబియాపై పాక్‌ తీర్మానం

Mar 16,2024 12:57 #India, #Pakistan, #UNGA
  •  ఓటింగ్‌కు భారత్‌ దూరం
    ఐక్యరాజ్య సమితి : ఇస్లామోఫోబియాపై పాకిస్తాన్‌ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. హిందూవాదం, బౌద్ధవాదం, సిక్కు, ఇతర మత విశ్వాసాలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ భారత్‌ విమర్శించింది. కేవలం ఒక మతాన్ని మాత్రమే వేరు చేయడం కన్నా ఇతర మతాలు కూడా హింస, వివక్షను ఎదుర్కొంటున్నాయని గుర్తించాలని పేర్కొంది.
    ఇస్లామోఫోబియాను ఎదుర్కొనేందుకు చర్యలు అన్న పేరుతో పాకిస్తాన్‌ శుక్రవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 115 దేశాలు ఓటు వేయగా, 44 దేశాలు గైర్హాజరయ్యాయి. వీటిలో భారత్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్‌, బ్రిటన్‌ వున్నాయి. యూదు వ్యతిరేకత, క్రైస్తవ విద్వేషం, ఇస్లామ్‌ పట్ల వ్యతిరేకతతో చేపట్టే చర్యలన్నింటినీ భారత్‌ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్‌ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఫోబియాలు ఇతర మతాలకు కూడా వున్నాయని గుర్తించడం ముఖ్యమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ముస్లిమేతర మతాలు కూడా మత విద్వేషాలను ఎదుర్కొంటున్నాయనడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయన్నారు. కాలక్రమంలో మతపరమైన ఫోబియాకు సమకాలీన రూపాలు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా హిందూ, బౌద్ధ, సిక్కు వ్యతిరేక భావాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తలెత్తుతున్న మతపరమైన వివక్ష విస్తృత రూపాన్ని కూడా సభ్య దేశాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
➡️